బీటెక్ విద్యార్థిని బలవన్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం, కొత్తచెలికానివలసలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన రాకోటి రామారావు కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తుంటారు. పేదరికంలో ఉన్నప్పటికీ చిన్నకూతురైన పగడాలమ్మను బీటెక్ చదివిస్తున్నాడు. కాలేజీకి రాకపోకలు సాగించే క్రమంలో పగడాలమ్మకు.. రంగరాయపురానికి చెందిన డబ్బాడ హరీశ్ తో పరిచయం ఏర్పడింది. కులాలు వేరైనప్పటికీ పగడాలమ్మ, హరీశ్ ల మద్య పరిచయం ప్రేమగా మారింది. కులాంతర వివాహం చేసుకుందామని నమ్మకంగా చెప్పడంతో హరీశ్ కు ఆమె శారీరకంగానూ దగ్గరైంది. వాళ్లిద్దరూ ఏకాంతంగా కలిసున్న దృశ్యాలను హరీశ్ రహస్యంగా తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ వీడియోలను అడ్డంపెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. అశ్లీల వీడియోలను అడ్డం పెట్టుకుని తన బతుకు పాడుచేయొద్దని పగడాలమ్మ ఎంత వేడుకున్నా హరీశ్ వినిపించుకోలేదు. బెదిరింపులకు లొంగకపోవడంతో చివరికి అతను దుర్మార్గానికి పాల్పడ్డాడు. విజయవాడలో పనిచేస్తోన్న పగడాలమ్మ సోదరుడు ప్రవీణ్ కు ఆమె అశ్లీల వీడియోలను పంపాడు హరీశ్. తెలిసినవాళ్లు అందరికీ వీడియోలు పంపుతానని బెదిరించాడు. దీంతో పగడాలమ్మ తీవ్ర మనస్తాపానికగురై గత నెల 30న ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయిన తమ కూతురు బాధితురాలేనన్న స్పృహ లేకపోవడం, వీడియోల గురించి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంంతో కుటుంబీకులు గుట్టుచప్పుడు కాకుండా పగడాలమ్మ మృతదేహాన్ని ఖననం చేసేశారు. కానీ పగడాలమ్మకు జరిగింది తీరని అన్యాయం అని, ఈ ఉదంతంలో ఆమె బాధితురాలేనని అర్థమైన తర్వాతగానీ, దళిత సంఘాల సహాయంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబీకుల ఫిర్యాదుతో పగడాలమ్మ మృతిపై రేగిడి ఆముదాలవలస పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం నాడు పగడాలమ్మను ఖననం చేసిన ప్రదేశాన్ని మళ్లీ తొవ్వి మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేశారు. నిందితుడు హరీశ్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ప్రేమ పేరుతో పేద విద్యార్థినిని లోబర్చుకుని, అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడి, ఆమె మృతికి కారకుడైన హరీశ్ ను కఠినంగా శిక్షించాలంటూ కుటుంబీకులు, దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)