సరస్వతీ కటాక్షం...!

Telugu Lo Computer
0

 


ఒక విద్వాంసుడు భోజరాజు కొలువుకు వచ్చాడు. స్వస్తి వచనాలు పలికి రాజా నేను కాశీ నగరం నుండి దక్షిణ దిక్కుకు యాత్రకు వచ్చాను. నేను మంత్ర శాస్త్రం  బాగా అధ్యయనం చేశాను అన్నాడు. నేను ఎవరి తలపైన అయినా నా చేయి  వుంచి మంత్రం జపం చేస్తే వాళ్లకు వెంటనే సరస్వతీ కటాక్షం కలిగి కవిత్వం చెప్పే శక్తి వస్తుంది. అన్నాడు.  
రాజు ఓహో మీ ప్రతిభ అద్భుతం మాకూ కొంచెం చూపించండి అని ఒక పరిచారికను పిలిచి ఈమె తలపై చేయి వుంచి జపం చేయండి అన్నాడు. మాంత్రికుడు ఆమె తలపై చేయి వుంచి జపం చేసి చూడమ్మా!  రాజుగారు నిన్ను ఏదో ఒక విషయం పైన కవిత్వం చెప్పమని అడుగుతారు. అడిగిన విషయం మీద శ్లోకం చెప్పు అన్నాడు. 
ఆమె అలాగే స్వామీ మీ దయ వాళ్ళ నాకు శబ్దాలూ, అర్థాలూ కరతలామలకం అయ్యాయి. రాజా ఏ విషయం మీద కవిత్వం చెప్పమంటారో చెప్పండి అనింది ఆ పరిచారిక. రాజు తన దగ్గర వున్న  ఖడ్గాన్ని చూపి దీన్ని వర్ణిస్తూ శ్లోకం చెప్పు అన్నాడు. ఆమె వెంటనే ఈ క్రింది శ్లోకం చెప్పింది. 
దారాధరః త్వదసి రేష నరేంద్ర చిత్రం  వర్షంతి వైరి లోచనాని 
కోశేన సంతతమసంగతి రాహవేస్య    దారిద్ర్య మభ్యుదయతే ప్రతి పార్థివానాం 
అర్థము:--రాజా యిది చిత్రమే నీ కత్తి దారాధారం (అంటే చాలా పదునైనది.)దారాధారం అంటే మేఘమని కూడా అర్థమున్నది. మేఘం లాగా యిది వర్షాన్ని నీ  శత్రు రాజుల భార్యల  కళ్ళల్లో
కురిపిస్తుంది. (అంటే తమ భర్తలు యుద్ధం లో చనిపోయారని వాళ్ళు ఏడుస్తారు ) దీన్ని యుద్ధం లో నిరంతరం వాడు తుంటావు  కాబట్టి దీని ఒర ఎప్పుడూ ఖాళీగా వుండడం సహజం. (కత్తికి ఎప్పుడూ ఒర తో సాంగత్యం వుండదు.) కోశము అంటే ధనాగారమని కూడా అర్థముంది.)
నీవు శత్రు రాజులతో నిరంతరం యుద్ధం చేయడం వల్ల  వారి కోశాగారాలు కూడా ఖాళీ అయిపోయి వారికి దారిద్య్రం కలుగుతున్నది. నీ కోశము (ఒర) ఖాళీ గానే వుంటుంది. నీ శత్రు రాజుల కోశాగారాలు కూడా ఖాళీగానే వుంటాయి. దారాధారం, కోశము రెండిటికీ సమన్వయం చేసి చెప్పింది రాజు మాంత్రికుడి ప్రతిభకు అబ్బురపడి రత్న కలశాలతో సత్కరించాడు. పరిచారికను కూడా తగు రీతిని సత్కరించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)