చిలకమర్తి లక్ష్మీనరసింహం

Telugu Lo Computer
0


చిలకమర్తి లక్ష్మీనరసింహం  కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకరు.మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం. లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26 న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించారు.

ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నారు.1889 లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు.తరువాత ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించారు.తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశారు.ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపారు.తరువాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత పాఠశాల గా మార్చబడింది.

30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు.ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.  పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశారు.కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించారు.

గయీపాఖ్యానం నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవారు.ఆయన వ్రాసిన నవలలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశారు. 1908లో ఒక ప్రెస్ స్థాపించారు.1916 లో మనోరమ, పత్రిక అనే పత్రిక స్థాపించారు.దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు. 21 అధ్యాయాల్లో రాసిన స్వీయ చరిత్రములో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది. బాల్యం, నర్సాపురంలో చదువు, రాజమండ్రిలో విద్యాభ్యాసం, ఉద్యోగం. గ్రంథంరచన, నాటకసమాజం, వివాహం, మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల ఏర్పాటు, నిర్వహణ, ఉన్నతపాఠశాల ప్రారంభం, కుటుంబ సమస్యలు, కష్టాలు, టంగుటూరి ప్రకాశం ఇంగ్లండ్‌ యాత్ర, హితకారిణి సమాజస్థాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ – యివన్నీ సవివరంగా రాశారు.చిలకమర్తి ఏకసంధాగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి, స్వీయచరిత్రలో, తన జీవితకాలంలో జరిగిన ఘటనలను, సూక్ష్మాంశాలతో సహా చిత్రించారు.చారిత్రక ఘటనలను సమతూకంతోనూ, వ్యక్తుల గూర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాల కతీతంగా, స్పష్టంగా, క్లుప్తంగా రాశారు.నిత్యనైమిత్తకాల గూర్చి రాస్తున్నా, వాటినొక అంతర్‌దృష్టితో పరికించారు. 1946, జూన్ 17 న లక్ష్మీనరసింహం మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)