డోస్‌ల వ్యవధి పెంపుతో ముప్పు!

Telugu Lo Computer
0

కోవిడ్ టీకా డోస్‌ల మధ్య వ్యవధిని ఎక్కువ పెంచడం వల్ల వేరియంట్ల పుట్టుకొస్తాయని అమెరికా అధ్యక్షుడి వైద్య సలహాదారు, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఇది వైరస్ మరింత వ్యాప్తికి కారణమవుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు.  గత నెలలో వ్యాక్సిన్ డోస్‌ల మధ్య విరామం పెంచుతూ భారత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై అడిగిన ప్రశ్నకు ఫౌచీ పై విధంగా సమాధానం ఇచ్చారు.
‘‘ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల మధ్య వ్యవధికి వస్తే ఫైజర్ మూడు వారాలు, మోడెర్నా నాలుగు వారాలు డోస్‌ల మధ్య విరామం పెంచడం వల్ల వేరియంట్ల ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారు. యూకేలో ఇదే జరిగిందని పేర్కొన్నారు. ‘‘టీకాల మధ్య విరామం పెంచడం వల్ల ఈ సమయంలో కొత్త వేరియంట్స్ వ్యాప్తిచెందాయి.. కాబట్టి సాధారణ షెడ్యూల్‌ను కొనసాగించాలి’’ అని అన్నారు. ఒకవేళ డోస్‌లు సరఫరా తక్కువగా ఉంటేనే తప్పా ఎక్కువ వ్యవధి పాటించరాదని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం గత నెలలో రెండోసారి కోవిషీల్డ్ టీకా డోస్‌ల మధ్య వ్యవధిని ఆరు నుంచి ఎనిమిది వారాలు నుంచి 12-16 వారాలకు పెంచిన విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చిలోనే 28 రోజుల వ్యవధిని 6-8 వారాలకు పెంచింది. కోవిషీల్డ్ డోస్‌ల మధ్య వ్యవధి ఎక్కువ వల్ల మరింత ప్రభావంతంగా టీకా పనిచేస్తుందని కేంద్రానికి నిపుణుల కమిటీ సూచించింది. దేశంలో టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో ఈ సిఫార్సులు చేయడం గమనార్హం. డోస్‌ల మధ్య విరామం పెంచడం వల్ల ఎక్కువ మందికి టీకాల వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
గత నెలలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్దించిన ఫౌచీ.. శుక్రవారం భిన్నంగా స్పందించారు. వైరస్ బారి నుంచి ముఖ్యంగా అత్యంత ప్రమాదకర డెల్టా వేరియంట్‌ నుంచి బయటపడాలంటే వీలైనంత త్వరగా ప్రజలకు టీకా వేయాలని సూచించారు. భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్ మిగతా వాటి కంటే 40 నుంచి 50 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
‘భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తిలో ఉందని, అత్యంత వేగంగా ఇతరులకు సంక్రమిస్తోంది.. ఏ దేశంలో అయినా ఈ వేరియంట్ ప్రభావానికి గురయినా వీలైనంత వేగంగా టీకాలను వేయాలి.. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తుల్లో డెల్టా వేరియంట్ చాలా చాలా వేగంగా వ్యాప్తిచెంది ఆధిపత్యం చూపుతుంది.. ప్రస్తుతం యూకేలో అదే జరుగుతోంది.. ఇది 90 శాతం వరకు ఆధిపత్యం సాధించింది’ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)