వైరస్‌ అంటే ? దీనిని కరోనా వైరస్‌ అని ఎందుకన్నారు?

Telugu Lo Computer
0

 #అస‌మాన‌త‌లు తొల‌గాలి!



కంటికి కానరాదు. తానంత తాను కదలలేదు. తాకను స్పర్శకు రాదు. కణాలను చేరి కకావికలం చేస్తుంది. ఏమిటది మాయా అంటే...! కాదుకాదు 'మహమ్మారి' అంటున్నారు డాక్టర్లంతా. దాని మర్మం ఏమిటో తెలుసుకుందామని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్‌ ఎస్‌. సుధాకర్‌ గారిని కలిసింది జీవన. ఆ మహమ్మారి గురించి.. దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఆయన చెప్పిన విషయాలేంటో తెలుసుకుందాం పదండి.
మహమ్మారి (పాండమిక్‌) అంటే?
ఒక వ్యాధి ఒక ప్రదేశంలో ప్రబలితే ఔట్‌ బ్రేక్‌ అంటాము. నిరంతరం ఒకేచోట ఆ వ్యాధి ఉంటూంటే ఎండమిక్‌ అంటాము. ఆ వ్యాధి ఒక జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రబలుతుంటే ఎపిడమిక్‌ అంటాము. అదే వ్యాధి ఒకే సమయంలో రోజులు, నెలల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూంటే దానిని పాండమిక్‌ అంటాం. ఇప్పటి కోవిడ్‌-19 ఇందుకు ఉదాహరణ.

ఇంతకు ముందు ఇలాంటివి వచ్చాయా?

చాలాసార్లు వచ్చాయి. మధ్య యుగాల్లో (1300 ఎసి) ప్లేగు వల్ల యూరప్‌లో నాలుగో వంతు ప్రజలు చనిపోయారు కూడా. చాలా గ్రామాల్లో ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలి, వేరే ప్రాంతాలకు పారిపోయారు. ఆ కాలంలో ప్లేగు వ్యాధి తరచుగా వస్తూ ఉండేది. మశూచి, కలరా, టైఫాయిడ్‌ వచ్చి, చాలా దేశాల్లో లక్షల మంది చనిపోయారు. మన దేశంలోనూ ప్రతి ఏడాది వేలమంది చనిపోయేవారు. 1917-18లో ఇన్‌ఫ్లూఎంజా (స్పానిష్‌ప్లూ) అలలు అలలుగా వచ్చి, రెండు నుంచి నాలుగు కోట్ల మంది యువకులు చనిపోయారు. 1957లో అలాంటి ఇన్‌ప్లూఎంజా మళ్లీ మహమ్మారిలా విజృంభించింది. అయితే ఈ సారి అంతమందిని పొట్టన పెట్టుకోలేదు. ప్రతి ఏడాది అమెరికాలాంటి చలి ప్రదేశాల్లో శీతాకాలంలో ఇన్‌ప్లూఎంజా ఎటాక్‌ చేసేది. అందుకే అక్కడ వ్యాక్సిన్‌ ప్రతి సంవత్సరం ప్రజలకు ఇస్తారు. అలాగే మశూచి, ఎపిడమిక్‌గానూ, పాండ్‌మిక్‌గానూ వస్తూంటుంది.

పాండమిక్స్‌ దేని వల్ల వస్తాయి?

ఇవి సూక్ష్మక్రిముల వల్ల వస్తాయి. మైక్రోస్కోప్‌తో చూడగలిగే వాటిని బ్యాక్టీరియా అంటాము. ఇవి 300ఎన్‌ఎమ్‌ కంటే పెద్దగా ఉంటాయి. వైరస్‌లు 20ఎన్‌ఎం నుంచి 300ఎన్‌ఎం మధ్య సైజుల్లో ఉంటాయి. వీటిని చూడటానికి ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ వాడతాము. ప్లేగు, కలరా, టైఫాయిడ్‌, టిబి-టైఫస్‌ బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఇన్‌ఫ్లూఎంజా, స్మాల్‌ఫాక్స్‌, మీజిల్స్‌, మంప్స్‌, చికెన్‌ఫాక్స్‌, కామన్‌ కోల్డ్‌, సార్స్‌, కోవిడ్‌-19 వైరస్‌లు. అలాగే 1980 తరువాత హెచ్‌ఐవి వైరస్‌ వల్ల ఎయిడ్స్‌ పాండమిక్‌గా వచ్చింది.

వైరస్‌ అంటే ?

ఇది ఒక జీవపదార్థం (జెనెటిక్‌ మెటీరియల్‌). ఇంకా వివరంగా చెప్పాలంటే లైపో ప్రోటీన్‌తో కప్పబడిన న్యూక్లిక్‌ యాసిడ్‌ను వైరస్‌ అంటాము. వీటికి స్వయంగా చలించే లక్షణం ఉండదు. వాటంతటవి విచ్ఛిత్తి (మల్టిప్లై) చెందలేవు. మనిషి శరీరంలోకి ప్రవేశించి, ఆ శరీరంలోని కణాలను ఆవరించి, కొత్త వైరస్‌లు (వందలు, వేల సంఖ్యలో) తయారై, అవయవాలను డ్యామేజి చేసి, కణజాలాల్లోకి వేగంగా విస్తరిస్తాయి. ఇవి విభజన చెందేలోపే వ్యాధి నిరోధకశక్తి కలిగిన శరీరంలో యాంటిబయాటిక్స్‌ వీటిని అదుపు చేస్తాయి. వ్యాధి నిరోధకశక్తి లేనప్పుడు వ్యాధికి గురై, ఆ మనిషికి మరణం సంభవిస్తుంది.

దీనిని కరోనా వైరస్‌ అని ఎందుకన్నారు?

ఇది కరోనా జాతికి చెందిన వైరస్‌. సూర్యుని చుట్టూ కిరణాల ఏరియాను కరోనా అంటారు. ఈ వైరస్‌ కూడా ఆ ఆకారంలో ఉండబట్టి, దీనిని 'కరోనా' అని పిలిచారు. మొదట దీని లక్షణాలు కొత్తగా ఉండటంతో నావెల్‌ కరోనా వైరస్‌ అన్నారు. తరువాత 2019లో దీని ప్రభావానికి గురైన గుర్తుగా కోవిడ్‌-19 (కరోనా వైరస్‌ డిసీజ్‌-19) అని అన్నారు.

శరీరంలో ఎలా వ్యాపిస్తుంది?

ఇది రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌. మామూలుగా కరోనా జాతికి చెందిన వైరస్‌లు అప్పర్‌ రెస్పిరేటరీ (శ్వాసకోశ సంబంధ) సిస్టమ్‌లో వృద్ధి చెంది, ఇబ్బంది పెడతాయి. కానీ కోవిడ్‌-19 ఊపిరితిత్తుల లోపల కూడా వ్యాపించి, న్యుమోనియాకు కారణమవుతుంది. లంగ్స్‌ను డామేజ్‌ చేసి, ఊపిరిపీల్చడం కష్టమై, ఆయాసం ప్రారంభమవుతుంది. తీవ్రతను బట్టి మరణం సంభవించే అవకాశాలున్నాయి. పొడి దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలతో మొదలవుతుంది. వ్యాధి ముదిరేకొద్దీ కొంతమందికి కళ్ల కలకలు, నీళ్ల విరోచనాలు సంభవించవచ్చు. నూటికి 80 మందికి వ్యాధి సోకినా లక్షణాలు బయటపడక, ఆర్‌టి-పిసిఆర్‌ టెస్ట్‌ చేసినా పాజిటివ్‌ రావచ్చు. 20 శాతం ఇంటెన్సివ్‌కేర్‌ వరకూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

కోవిడ్‌-19 ఫ్లూ జ్వరాన్ని పోలి ఉంటుంది కదా! రెండింటికీ ప్రత్యేకమైన తేడా?

రెండూ దాదాపు ఒకేరకమైన వ్యాధులు. ప్లూకి వ్యాక్సిన్‌ ఉంది. చికిత్సా ఉంది. అది కణజాలాన్ని ఎటాక్‌ చేసే లోపల చికిత్స చేసే అవకాశం ఉంది. కానీ కోవిడ్‌-19కి మందులు లేవు. వ్యాక్సిన్‌ తయారు చేయడానికి కొంత సమయం (ఏడాది) పడుతుంది.

కోవిడ్‌-19 సోకిన వారందరికి ప్రాణభయం ఉందా?

వ్యాధి నిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, ముఖ్యంగా వయో వృద్ధులు, గుండె, మూత్ర పిండాలు, డయాబెటీస్‌, శ్వాస సంబంధ వ్యాధులు ఉన్న వారికి సులభంగా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. వ్యాధి సోకిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుని, ఊపిరిపీల్చడం ఇబ్బంది అయినప్పుడు కృత్రిమంగా (వెంటిలేషన్‌) శ్వాసను అందించాలి. అప్పటికీ తట్టుకోలేని పరిస్థితి ఎదురైతేనే మరణం సంభవిస్తుంది.

మీరు చెబుతున్న జాగ్రత్తలు పాటించి.. దీన్ని అరికట్టవచ్చా?

కోవిడ్‌-19 చాలా తేలికగా వ్యాప్తి చెందుతుంది. చాలామంది వ్యాధి లక్షణాలు బయటపడకుండానే క్యారియర్స్‌ అవుతున్నారు. ఈ వైరస్‌ తుమ్మడం, దగ్గడం వల్ల (ఆరు అడుగుల దూరం వరకూ గాలిలో ప్రయాణించి) గోడలు, వస్తువులు, మెట్ల రైలింగ్స్‌ మీద పడి, నాలుగు గంటల వరకూ బతికి ఉండే అవకాశం ఉంది. ఆ సమయం లోపల మరెవరైనా వాటిని తాకి, వారి చేతులను కళ్లు, ముక్కు, నోరు దగ్గర పెట్టుకుంటే వారికి ఈ వ్యాధి సోకుతుంది. అందుకే అందరినీ ఇంటికే పరిమితం కావాలని, మాస్కులు, గ్లౌజులు వేసుకోమని హెచ్చరించేది. చేతులు సబ్బుతో లేదా శానిటైజర్స్‌తో తరచుగా శుభ్రపరుచుకోవడం అవసరమే. అలాగే భౌతిక దూరం (ఆరు అడుగులు) పాటించాలి.
ఎవరింట్లో వారుంటే వ్యాధి రాకుండా ఉంటుందా ?
అలా చేయడంవల్ల వ్యాధి సోకే వేగాన్ని (ఫ్లాటరింగ్‌ ద కర్వ్‌) తగ్గించవచ్చు. ఇలా పాటించకపోవడం వలనే అమెరికా, ఇటలీలో వ్యాధి తీవ్రరూపం చెందింది. అక్కడ వేలాది మంది చనిపోతున్నారు. అక్కడ వృద్ధుల సంఖ్యా ఎక్కువగానే ఉంటుంది.

ప్రపంచవ్యాప్త లాక్‌డౌన్‌ అవసరమా?
అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈ మహమ్మారిని నివారించ లేకపోవడానికి కారణం ఏమిటి ?

కోవిడ్‌-19 కొత్తగా వచ్చింది కాబట్టి టెస్ట్‌ కిట్స్‌, వ్యాక్సిన్స్‌, మెడిసిన్స్‌ రెడీగా లేకపోవడం వలన లాక్‌డౌన్‌ కంటే మార్గం లేదు. అమెరికా, బ్రిటన్‌, జపాన్‌లు చెప్పుకోవడానికే అభివృద్ధి చెందిన దేశాలు. తాత్కాలిక ఉపశమనం కోసం వాడే క్లోరోఫిన్‌ కోసం మన దేశంపై ఆధారపడవలసి వచ్చింది. ఆయా దేశాలు ఆరోగ్య వ్యవస్థకు జిడిపిలో 10 శాతం, మన దేశంలో 1.3 శాతం నిధులే కేటాయించారు. అంతేకాక వ్యాధి తీవ్రతను గుర్తించకుండా నిర్లక్ష్యం వహించడమూ కారణమే. ఇండియా వ్యాధి తీవ్రతను గుర్తించడంలో అలసత్వం వహించడంతో లాక్‌ డౌన్‌ను పొడిగించవల్సిన అగత్యం ఏర్పడింది. దక్షిణ కొరియా, జర్మనీల్లో సత్వర చర్యలు చేపట్టి, మంచి ఫలితం పొందారు. తక్కువ కాలంలోనే వ్యాధిని నివారించగలిగారు. అతి చిన్న దేశం అయిన క్యూబా డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరిక వెలువడిన వెంటనే నివారణా చర్యలు, పరిశోధనలు చేపట్టి, పెద్ద పెద్ద దేశాలకు సైతం చేయూతనందించగల్గింది. మన దగ్గర టెస్ట్‌ కిట్స్‌, బెడ్స్‌, వెంటిలేషన్స్‌ చాలా చాలా తక్కువ ఉన్నాయి. అందువలన లాక్‌డౌన్‌ మనకు తప్పనిసరి అయింది. ప్రస్తుతం కొత్త కిట్స్‌ తెప్పిస్తున్నారు. ప్రయివేటు హాస్పిటల్స్‌లో బెడ్స్‌, వెంటిలేటర్స్‌ లిస్ట్‌ అవుట్‌ చేసి, అవసరమైన మేరకు ఉపయోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంచుకుంది.

ఈ సూక్ష్మ క్రిములను పూర్తిగా నిర్మూలించలేమా?

మానవజాతి సమూలంగా అంతమైనా సూక్ష్మక్రిములను అంతం చేయలేము. ఎందుకంటే ఈ సూక్ష్మ క్రిములు మన చుట్టూ, మన శరీంలోనూ (మన జీర్ణకోశం, చర్మం, శరీరం అంతా) ఉన్నాయి. వాటి ప్రపంచంలో మనం ఉన్నాం. వీటిని పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం.

మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏమిటి?

మొదట మూఢనమ్మకాలను వదిలేయాలి. దేవుళ్లను, కర్మ సిద్ధాంతాన్ని కాకుండా శాస్త్రవేత్తలు, డాక్టర్స్‌ చెప్పే శాస్త్రీయ ఆలోచనలను ప్రజల్లో పెంపొందించాలి. పరిశుభ్రత, పర్యావరణ రక్షణ చర్యలపై అవగాహన పెంపొందించాలి.

మనదేశ భవిష్యత్‌ ఏమిటి?

ఇప్పటికైనా ప్రభుత్వాలు వాస్తవాన్ని గుర్తించి, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేసే వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయక దేశం అని చెప్పుకోవడం కాకుండా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, మన దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధిపథం వైపు నడిపించడానికి నడుంకట్టాలి. అతికొద్ది అవకాశాలతోనే ఈ విపత్కర పరిస్థితి ఎదురైన వెంటనే వారి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కిట్‌ను కనుగొన్న మినావ్‌ దఖావే భోంస్లే లాంటి వారనేక మంది మన దేశంలో ఉన్నారు. వారికి తగిన సదుపాయాలు ప్రభుత్వాలు కల్పిస్తే ఇతర దేశాలకు వెళ్లకుండా తమ దేశభవిష్యత్తును కాపాడతారు. ముఖ్యంగా ప్రభుత్వాలు దేశప్రజల మంచి చెడ్డల గురించి శ్రద్ధవహిస్తే ఆకలి చావులు, ఈ మహమ్మారుల బారి నుండి కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
దేశంలోని ఆర్థిక అసమానతలను తొలగించే క్రమంలో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ముఖేష్‌ అంబానీలాంటి ప్రముఖ పారిశ్రామికవేత్తల, విదేశీ పెట్టుబడుల చట్రాల్లో ఇరుక్కోకుండా, దేశ అభ్యున్నతికి పాటుపడేలా ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుందాం.
            • - ఇంటర్వ్యూ : టాన్యా తిరుమలశెట్టి

Post a Comment

0Comments

Post a Comment (0)