విప్రో లాభంలో 8 శాతం క్షీణత !

Telugu Lo Computer
0


విప్రో నాలుగో త్రైమాసిక ఫలితాల్ని శుక్రవారం ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,835 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,074.5 కోట్లతో పోలిస్తే 7.9 శాతం క్షీణత నమోదు చేసింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.23,190.3 కోట్ల నుంచి 4.2 శాతం తగ్గి రూ.22,208.3 కోట్లుగా నమోదైందని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 2.6 శాతం క్షీణించి రూ.11,045 కోట్లుగా నమోదైంది. ఆదాయం 0.8 శాతం క్షీణించి రూ.89,760.3 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొందని కంపెనీకి కొత్తగా నియమితులైన సీఈఓ, ఎండీ శ్రీనివాస్‌ పల్లియా పేర్కొన్నారు. అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే త్రైమాసికంలో ఆదాయంలో స్థిర ధరల వద్ద -1.5 - +0.5 శాతం మధ్య వృద్ధి నమోదుకావొచ్చని అంచనాలు వెలువరించారు. గతేడాదితో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య 9.1 శాతం క్షీణించి 2,34,054కి చేరింది. రిషద్ ఎ ప్రేమ్‌జీని ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా తిరిగి నియమించేందుకు విప్రో బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జులై 31 నుంచి 2029 జులై 30 వరకు అంటే ఐదేళ్ల కాలానికి ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. అలాగే, నాన్‌ అజీమ్‌ హెచ్‌ ప్రేమ్‌జీని నాన్ ఎగ్జిక్యూటివ్‌, స్వతంత్ర డైరెక్టర్‌గా ఐదేళ్ల పాటు తిరిగి నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు విప్రో తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో మార్కెట్‌ ముగిసేసరికి విప్రో షేరు విలువ 1.74 శాతం పెరిగి రూ.452.10 వద్ద స్థిరపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)