సిరియాపై ఇజ్రాయెల్‌ దాడి !

Telugu Lo Computer
0


సిరియాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. అక్కడి అతిపెద్ద నగరమైన అలెప్పోపై చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం మొదలు ఆ దేశ సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం వాటిల్లడం ఇదే మొదటిసారి. అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్‌బొల్లాకు చెందిన రాకెట్‌ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని బ్రిటన్‌ ఆధారిత 'సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌' తెలిపింది. ఇరాన్ అనుకూల గ్రూపులకు చెందిన రక్షణ కర్మాగారాలను కూడా టార్గెట్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనను సిరియా సైన్యం కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌తోపాటు స్థానిక తిరుగుబాటు దళాలు ఏకకాలంలో దాడులు చేశాయని పేర్కొంది. ఈ క్రమంలోనే సైనికులతోపాటు సాధారణ పౌరులూ మృతి చెందినట్లు ఆరోపించింది. తాజా దాడులపై ఇజ్రాయెల్‌ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అంతకు కొన్ని గంటల ముందే సిరియా రాజధాని డమస్కస్‌ శివార్లలోనూ ఓ నివాస భవనం లక్ష్యంగా చేపట్టిన దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారని స్థానిక మీడియా తెలిపింది. హెజ్‌బొల్లా సహా ఇరాన్‌ మద్దతుగల సాయుధ బృందాలకు కీలక స్థావరమైన సయిదా జైనాబ్‌ ప్రాంతంలో ఇది చోటుచేసుకున్నట్లు అబ్జర్వేటరీ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)