రాబోయే కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్లు !

Telugu Lo Computer
0


రాబోయే కొన్ని ఏళ్లలో భారతదేశంలో కనీసం 1000 కొత్త తరం 'అమృత్ భారత్ ట్రైన్'లను తయారు చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి పనులు జరుగుతున్నాయని శనివారం తెలిపారు. వందేభారత్ రైళ్ల ఎగుమతిపై ఇప్పటికే పనులు ప్రారంభించామని, వచ్చే ఐదేళ్లలో తొలి ఎగుమతి జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో రైల్వేల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన(చినాబ్ వంతెన), మొదటి అందర్ రివర్ వాటర్ టన్నెల్(కోల్‌కతా మెట్రో) వంటి సాంకేతిక పురోగతులు సాధ్యమయ్యాయని అన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో భాగంగా ముంబై-థానే మధ్య దేశంలోనే మొట్టమొదటి సముద్రగర్భ టన్నెల్ నిర్మాణం ప్రారంభంపై మాట్లాడుతూ.. ప్రపంచంలోనే 5 దేవాలు మాత్రమే ఇలాంటి సాంకేతికత కలిగి ఉన్నాయని చెప్పారు. తాము ప్రపంచ స్థాయి రైలుగా అమృత్ భారత్‌ని రూపొందించామని, కేవలం రూ. 454 ధరతో 1000 కి.మీ ప్రయాణాన్ని అందిస్తున్నామని చెప్పారు. 10 క్రితంతో పోలిస్తే ప్రస్తుతం రైల్వే స్టేషన్లు భిన్నంగా ఉన్నాయని, పరిశుభ్రంగా మారాయని అన్నారు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో యువతలో వందే భారత్ వంటి రైళ్లు బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. గతేడాది 5200 కిలోమీటర్ల కొత్త ట్రాక్ ఏర్పాటు చేశామని, ఈ ఏడాది 5500 కి.మీ కొత్త ట్రాక్ ఏర్పాటు చేస్తామని, గత 10 ఏళ్లలో రైల్వే ప్రయాణికుల భద్రత కోసం రూ.1.75 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. ప్రతీ ఏడాది దాదాపుగా 7000 కి.మీ అరిగిపోయిన ట్రాక్‌లను మారుస్తున్నట్లు చెప్పారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ జాప్యానికి మహారాష్ట్రలోని గత ప్రభుత్వమే కారణమని అశ్విని వైష్ణవ్ అన్నారు. వాపి నుంచి అహ్మదాబాద్ వరకు గుజరాత్ సెక్షన్ పనులు వేగంగా జరిగాయని, అయితే అప్పటి ఠాక్రే ప్రభుత్వం ముంబాయి నుంచి వాపి సెక్షన్ పనులకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)