యూరోపియన్ దేశాలను బెంబేలెత్తిస్తున్న 'పారెట్ ఫీవర్' ?

Telugu Lo Computer
0


యూరోపియన్ దేశాల్లో 'పారెట్ ఫీవర్' విజృంభిస్తోంది. దీనిని సిటాకోసిస్ అని కూడా అంటారు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఐదుగురు మృతి చెందగా.. కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో ఇది తీవ్ర ప్రభావం చూపుతుండటంతో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పారెట్ ఫీవర్ అనేది 'క్లామిడోఫిలా సిటాసి'  అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా అడవి పక్షులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు ఆరోగ్యంగానే కనిపిస్తాయి కానీ.. అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు ఈ బ్యాక్టీరియాని విడుదల చేస్తాయి. అలా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎవరైతే పక్షులతో అనుబంధం కలిగి ఉంటారో, వాళ్లు ఈ వ్యాధి బారిన పడతారని వెల్లడైంది. 2023 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని.. 2024లో ఇది ఐదుగురిని బలి తీసుకుందని డబ్ల్యూహెచ్ఓ  వెల్లడించింది. అయితే.. ఈ పారెట్ ఫీవర్ ప్రభావం తక్కువగానే ఉందని, ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడిన రోగుల్లో జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఈ బ్యాక్టీరియాకు గురైన వ్యక్తుల్లో 5 నుండి 14 రోజులలోపు లక్షణాలు బయటపడతాయి. అప్పుడు వెంటనే యాంటీబయాటిక్ చికిత్సను అందిస్తే.. ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చు. న్యుమోనియా  వంటి సమస్యలను కూడా నివారించొచ్చు. ఈ వ్యాధి 100 మందికి సోకితే, ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి.. ఈ వ్యాధి మరీ ప్రాణాంతకమైంది కాదని వైద్యులు చెప్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)