సుప్రీం తీర్పును స్వాగతించిన ప్రధాని మోడీ !

Telugu Lo Computer
0


ట్టసభ సభ్యుల అవినీతిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ఖాతాలో స్పందించారు. ''గౌరవ సుప్రీం కోర్టు అద్భుతమైన తీర్పును ఇచ్చింది. అది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలకు కారణమై, వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది'' అని అభిప్రాయపడ్డారు. ఈ పోస్టుకు సుప్రీం తీర్పునకు సంబంధించిన కథనాన్ని జత చేశారు. లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని నేడు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దేశాన్ని కుదిపేసిన 1993 నాటి జేఎంఎం ముడుపుల కేసును విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 1998లో తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల తర్వాత ఈ తీర్పును పునఃసమీక్షించేందుకు గతేడాది సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. శాసనకర్తలుగా చట్టసభల సభ్యులకు విశేష హక్కులు ఉన్నప్పటికీ వారు చట్టానికి అతీతులు కాబోరని, లంచం తీసుకోవడాన్ని విచారణ పరిధి నుంచి మినహాయించడం సరికాదని నాడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనానికి తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)