ఐదేళ్లు 22, 217 ఎలక్టోరల్ బాండ్లు జారీ !

Telugu Lo Computer
0


డిచిన ఐదేళ్లలో పలు రాజకీయ పార్టీలకు వెళ్లిన ఎలక్టోరల్ బాండ్ల విషయాలు బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఎస్బీఐను ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎస్బీఐ ఓ పెన్ డ్రైవ్‌లో బాండ్ల వివరాలు సమర్పించింది. ఎలక్టోరల్ బాండ్స్ డేటా సమర్పించాలని సుప్రీం కోర్టు రెండు రోజులు గడువు విధించింది. దీంతో బుధవారం ఎస్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్బీఐ బాండ్ల డేటాను భారత ఎన్నికల కమిషన్ కి సమర్పించింది. పెన్ డ్రైవ్‌లో ఈసీకి డేటాను సమర్పించినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. డేటా, పాస్‌వర్డ్ రెండు PDF ఫైల్‌లలో ఉన్నాయని పేర్కొంది. 2019 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్య కాలంలో మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్‌లు జారీ చేశామని అఫిడవిట్‌లో ఉంది. ఇందులో రాజకీయ పార్టీలు 22,030 బాండ్లను రీడీమ్ చేశాయి. మిగిలిన 187 బాండ్లు రీడీమ్ చేసి, నిబంధనల ప్రకారం నగదును ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్లు బ్యాంక్ తెలిపింది. ఈ పథకం కింద దాతలు తమకు నచ్చిన పార్టీలకు విరాళం ఇవ్వడానికి బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే పార్టీలు 15 రోజుల్లోగా బాండ్లను రీడీమ్ చేసుకోవాలి, లేని పక్షంలో ఆ మొత్తం ప్రధానమంత్రి సహాయ నిధికి చేరుతుంది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధంమని.. ఇవి పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ సుప్రీం కోర్టు వాటిని ఫిబ్రవరి 15న నిషేధించింది. బాండ్ల జారీని వెంటనే నిలిపివేయాలని, విరాళాల వివరాలను ఈసీకి సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. డేటాను సమర్పించడానికి కోర్టు ఎస్బీఐకు మార్చి 6 వరకు గడువు విధించింది. మార్చి 13 లోపు దానిని వెబ్ సైట్‌లో ఉంచాలని ఈసీని కోరింది. పూర్తి వివరాలు సమర్పించడానికి జూన్ 30 వరకు గడువు పొడిగించాలని బ్యాంక్ కోర్టును అభ్యర్థించింది. దీనిని కోర్టు తిరస్కరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)