పట్టాలెక్కనున్న హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ హైస్పీడ్ రైలు కారిడార్ ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరేందుకు సమయం దగ్గరపడింది. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు కేవలం నాలుగు గంటల్లోనే చేరుకొనే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.  ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే చేపట్టింది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెలలోనే ఎస్‌ఎం కన్సల్టెన్సీకి అప్పగించారు. వచ్చే నెల మార్చి నాటికి ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నట్ల సమాచారం. ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక (డీపీఆర్‌) రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే.. రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల రైలు కల సాకారం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా.. డీపీఆర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ హైస్పీడ్‌ కారిడార్‌లో గరిష్ఠంగా 220 కిలో మీటర్ల వేగంతో రైలు పరిగెత్తించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీరింగ్.. ట్రాఫిక్ సర్వేపై ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ హైస్పీడ్ కారిడార్ లో 220 కిలో మీటర్ల వేగంతో వెళ్లేలా నూతన లైన్లను నిర్మించాలనే రైల్వే శాఖ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పనులు త్వరతిగతిన పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ హై స్పీడ్ కారిడార్‌ మార్గంలో అటు ప్రయాణీకుల సమయంతోపాటు..ఇటు రైల్వేకు ఆదాయం పరంగా కలిసి వస్తుందనేది అధ్యయనంలో వెల్లడించారు. హైస్పీడ్ కారిడార్ ప్రణాళికలు కార్యరూపం దాల్చి అందుబాటులోకి వస్తే నాలుగు గంటల్లోనే సికింద్రాబాద్ - విశాఖ చేరుకునే వెసులుబాటు కలుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ - వైజాగ్‌ మధ్య రైలు ప్రయాణం 12 గంటలుగా ఉంది. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు ప్రస్తుతం నల్గొండ, గుంటూరు మీదగా ఒక మార్గం, వరంగల్, ఖమ్మం మీదగా రెండో మార్గం అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ రెండూ రద్దీగానే ఉంటాయి. వరంగల్ మార్గంలో ట్రాక్ గరిష్ట సామర్థ్యం 150 కిలోమీటర్లుగా ఉంటోంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులను హైస్పీడ్ రైలు కారిడార్ ద్వారా అనుసంధానం చేయాలని భారత రైల్వే భావిస్తోంది.అయితే, ఇప్పటికే వందేభారత్ రైలు ద్వారా విశాఖ - సికింద్రాబాద్ మధ్య ప్రయాణీకులకు ప్రయాణ సమయం చాలావరకూ తగ్గింది. తాజాగా, ఈ హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే మరింతగా ప్రయాణ సమయం తగ్గటంతో పాటుగా సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణీకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)