వైఎస్ షర్మిల అరెస్టు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గతంలో ఇచ్చిన 23 వేల పోస్టుల మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకోకుండా కేవలం 6000 పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తతలకు దారి తీసింది. సెక్రటేరియట్ కు బయలుదేరిన వైఎస్ షర్మిను పోలీసులు ఉండవల్లి వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపైనే నిరసనకు దిగారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వెనక్కి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఆరు వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటన నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆరోపిస్తూ ఛలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉదయం నుంచే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఛలో సెక్రటేరియట్ ను అడ్డుకునేందుకు పోలీసులు నిన్న రాత్రి నుంచే కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన వైఎస్ షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లోనే రాత్రి బస చేశారు. ఉదయం విజయవాడ నుంచి సచివాలయానికి వైఎస్ షర్మిల పాదయాత్రగా బయలుదేరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి షర్మిల చేపట్టిన పాదయాత్ర ఏలూరు రోడ్డు మీదుగా చల్లపల్లి బంగ్లా వద్దకు చేరుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి షర్మిల మానవహారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలని, నాయకుల్ని విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి వైఎస్ షర్మిల సెక్రటేరియట్ కు బయలుదేరారు. దీంతో గుంటూరు జిల్లా సీతానగరం కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు షర్మిలను అరెస్టు చేస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)