చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ కేసు విచారణ 26కు వాయిదా !

Telugu Lo Computer
0


స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈనెల 26 కు కేసు విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దాదాపు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీనిని ఏపీ సిఐడి సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలను, ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటీషన్ లో పేర్కొంది. జనవరి 19న సిఐడి పిటిషన్ విచారణకు రాగా.. కౌంటర్ దాఖలుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సమయం కావాలని కోరారు. దీంతో కేసు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరిగింది. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణను స్వీకరించింది. హైకోర్టులో తమ వాదనలను పట్టించుకోలేదని సిఐడి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అటు చంద్రబాబు తరఫు న్యాయవాదులు మూడు వారాల పాటు కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై సీఐడీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోర్టు రెండు వారాలపాటు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)