పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు !

Telugu Lo Computer
0


శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో సోమవారం నుంచి భక్తుల వస్త్రధారణపై(డ్రెస్ కోడ్) కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో ఇకపై భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతోనే ఆలయ ప్రవేశం చేయాలి. ఆలయ ప్రాంగణంలో గుట్కా, పాన్ నమలడాన్ని కూడా నిషేధించారు. అంతేగాక 2024 నూతన సంవత్సరం నుంచి పాలిథిన్, ప్లాస్టిక్ సంచులపై కూడా నిషేధం అమలులోకి వచ్చింది. శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలోకి భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలో రావాలని, హాఫ్ ప్యాంట్లు, షార్ట్, చినిగిన జీన్స్, స్కర్ట్, స్లీవ్‌లెస్ దుస్తులతో ప్రవేశించరాదని శ్రీ జగన్నాథ్ ఆలయ పాలనా యంత్రాంగం(ఎస్‌జెటిఎ) అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఈ నిబంధన అమలులోకి రావడంతో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో పురుష భక్తులు ధోవతి, పై వస్త్రంతో, మహిళలు చీరలు, చుడీదార్ దుస్తులతో ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ ప్రాంగణం పవిత్రంగా ఉండేందుకు వీలుగా పాన్, గుట్కాలపై నిషేధం విధించినట్లు అధికారి చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు. కాగా..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 1.40 గంలకే గ్రాండ్ రోడ్డులో భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 1.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగులైన భక్తుల కోసం పోలీసులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)