చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్ కలసి పోటీ

Telugu Lo Computer
0


బిజెపి, ప్రతిపక్ష ఇండియా కూటమి మొట్టమొదటిసారి ముఖాముఖీ ఎన్నికల్లో తలపడనున్నాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో  మొదటిసారి నేరుగా ఈ రెండు పక్షాలు తలపడనున్నట్లు ఆప్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దా మంగళవారం తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికలే పునాది రాయి కాగలవని ఆయన విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించారు. జనవరి 18న జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడం ఖాయమని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి, బిజెపి మొదటిసారి ప్రత్యక్షంగా తలపడుతున్నాయని ఆయన చెప్పారు. ఆప్, కాంగ్రెస్ కలసికట్టుగా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికలు ప్రీఫైనల్స్ లాంటివని ఆయన చెప్పారు. మేయర్ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలుసుకుని ఎన్నికల్లో కలసి పోటీ చేయడంపై చర్చలు జరిపారని ఛద్దా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థి ఉంటారని, ఇద్దరు డిప్యుటీ మేయర్ అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి ఉంటారని ఆయన ప్రకటించారు. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మేయర్ అభ్యర్థిగా ఆప్‌కు చెందిన కుల్దీప్ కుమార్ టీటా పోటీ చేస్తారని, సీనియర్ డిప్యుటీ మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గుర్‌ప్రీత్ సింగ్ గాబి, డిప్యుటీ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన నిర్మలా దేవి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్న ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ ముందుగా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)