సొంతంగా పోటీ చేస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీప్రకటన !

Telugu Lo Computer
0


ఇండియా కూటమిలోని కీలకమైన తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు సొంతంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొద్దిసేపటికే పంజాబ్‌ ముఖ్యమంత్రి అదే ప్రకటన చేశారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని మా పార్టీ నిర్ణయించిందని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తెలిపారు. చండీగడ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మీడియా మమత తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించగా 'పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు లేదు. పంజాబ్‌లోని 13 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుంది' అని ప్రకటించారు. 'అత్యధిక స్థానాలు గెలుపొంది దేశంలో హీరోగా నిలుస్తాం' అని భగవంత్‌ మాన్‌ తెలిపారు. 13 స్థానాలకు ఎంతో మంది పోటీ పడుతున్నారని, కానీ 40 మందిని తుది జాబితాకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 'ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో గెలుపు గుర్రాలపై మేం మరోసారి సర్వే చేస్తాం. ఒక స్థానం నుంచి ఇద్దర ముగ్గురిని పరిశీలిస్తున్నాం. జలంధర్‌లో మాత్రం సిట్టింగ్‌ ఎంపీ మరోసారి పోటీ చేస్తారు' అని భగవంత్‌ మాన్‌ వివరించారు. ఒకే రోజు రెండు పార్టీలు సొంత నిర్ణయాలు ప్రకటించడంతో ఇండియా కూటమి కుదేలైంది. మొదటి నుంచి ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించడం కలకలం రేపింది. పదేళ్లుగా నియంతలా పాలిస్తున్న మోడీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. నాలుగైదు కూటమి సమావేశాలు కూడా సజావుగా జరిగాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ రెండు పార్టీలు సొంత దారి చూసుకోవడంతో కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీలో పొత్తుకు సరే కానీ రాష్ట్రాల్లో పొత్తుకు ఆయా పార్టీలు నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌లో ఆయా పార్టీలు సొంతంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఆ రెండు పార్టీల నిర్ణయం పరిశీలిస్తే.. ఎన్నికల వరకు ఒంటరిగా పోటీ చేసి ఫలితాల అనంతరం కూటమి విషయం ఆలోచిద్దామనే ఆలోచనలో ఉన్నాయని తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)