పొరుగు దేశాలను చైనా ప్రభావితం చేయగలదు !

Telugu Lo Computer
0


భారత్‌ పొరుగు దేశాలను చైనా ప్రభావితం చేయగలదనే విషయాన్ని అంగీకరించాల్సిందేనని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ అటువంటి పోటీ రాజకీయాలకు భయపడాల్సిన అవసరం మనకు లేదని ఉద్ఘాటించారు. మాల్దీవులపై చైనా ప్రభావం విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌ ముంబయి విద్యార్థులతో ముచ్చటించిన జైశంకర్‌.. ఎర్ర సముద్రంలో భారత నౌకాదళం చురుకైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే సామర్థ్యం నౌకాదళానికి ఉందనే విషయాన్ని ఇది చాటిచెబుతోందన్నారు. మాల్దీవుల విషయంపై విద్యార్థులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'చైనా కూడా పొరుగు దేశమే. పోటీ రాజకీయాల్లో భాగంగా అనేక విధాలుగా ఆయా దేశాలను ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గుర్తించాలి. మనం చైనాను చూసి భయపడాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ రాజకీయాలు పోటీతో కూడుకున్నవి. ఎవరికి సాధ్యమైన కృషి వాళ్లు చేస్తారు' అని జై శంకర్‌ అన్నారు. 'ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా.. అనేక వనరులను ఖర్చుచేసి తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. చైనా అలా చేస్తుందని మనమెందుకు ఫిర్యాదు చేయాలి. పోటీకి మనం భయపడకూడదు. పోటీని స్వాగతించాలి. ఆ సామర్థ్యం మనకూ ఉంది' అని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)