భక్తులతో కిక్కిరిసిన శబరిమల !

Telugu Lo Computer
0


బరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు సాగే దర్శనాల కోసం కేరళ నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివెళ్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్ల నిర్వహళణ, భక్తులను నిలువరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఫలితంగా కిలోమీటర్ల మేర భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఎంతసేపు లైన్‌లో నిల్చున్నా దర్శనం కావడం లేదని భక్తులు వాపోతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతన్న పరిస్థితి. రద్దీకి తోడు ట్రాఫిక్‌ సమస్యలు భక్తులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్‌జామ్‌ అవ్వడంతో పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉన్న దర్శన వేళలను గంట పెంచింది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శన అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)