ప్రయాణించే దూరాన్ని బట్టి టోల్ ఫీజు ?

Telugu Lo Computer
0


జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్ ఛార్జ్ వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా దీనిపై కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. రహదారులపై జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించి జర్నీని బట్టి టోల్ ఫీజు వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మార్చి నెల 2024 కల్లా జీపీఎస్ ఆధారిత టోల్ రోడ్స్ అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు వాహనం ప్రయాణించే కచ్చిత దూరాలకే టోల్ ఛార్జీలు వసూలు చేయడమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారట!. జీపీఎస్ ఆధారిత టోల్ ఛార్జీలు వసూలు చేస్తే వాహనదారులపై భారం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. కాగా, హైవే ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని NHAI కొన్ని రూల్స్ పాస్ చేసింది. చాలా టోల్ ప్లాజాలకు FASTag ఇంటిగ్రేషన్ ఉండటంతో 10 సెకన్ల నియమాన్ని పొందుపరిచారు. FASTag ఇంటిగ్రేషన్ తో టోల్ ప్లాజా వద్ద ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఈ నియమం గుర్తు చేస్తుంది.భారతదేశంలోని ప్రతి టోల్ ప్లాజాలో పీక్ అవర్స్‌లో కూడా ఒక్కో వాహనానికి సర్వీస్ టైమ్‌గా 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం వెచ్చించకూడదని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను జారీ చేసింది. అదేవిధంగా 100 మీటర్లకు మించి వాహనాలు క్యూలో నిలబడకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వేచి ఉన్న క్యూ 100 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే లేదా టోల్ బూత్‌కు చేరుకోవడానికి 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టినట్లయితే వాహనాల నుండి టోల్ వసూలు చేయకూడదు అని స్పష్టంగా రూల్స్ ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)