సీఏఏ అమలును ఎవ్వరూ ఆపలేరు !

Telugu Lo Computer
0


పౌరసత్వ (సవరణ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవినీతి, రాజకీయ హింస, బుజ్జగింపు రాజకీయాలను ప్రస్తావించిన ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీటన్నింటిని తరిమికొట్టేందుకు భాజపాను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పౌరసత్వ (సవరణ) చట్టంపై కేంద్ర మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నప్పటికీ దీని అమలును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. విపక్షాలు వ్యతిరేకిస్తున్నందునే దీనిపై ఆలస్యం జరుగుతోందన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అవినీతి, చొరబాట్లు, రాజకీయ హింస కొనసాగుతోందని ఆరోపించారు. దీదీ పాలనలో రాష్ట్రంలో చొరబాట్లు పెరిగాయన్నారు. వీటికి ముగింపు పలకాలంటే భాజపాను ఎన్నుకోవాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ హయాంలో కంటే భాజపా ప్రభుత్వంలోనే పశ్చిమ బెంగాల్‌కు అధిక నిధులు కేటాయించామన్నారు. 2024 వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా చూపించే పనితీరు.. రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేస్తుందని అన్నారు. ఇదిలాఉంటే, గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో భాజపా మెరుగైన పనితీరు కనబరిచింది. మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గాను 18చోట్ల విజయం సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 77 స్థానాల్లో గెలుపొందింది. ఇలా రాష్ట్రంలో కాషాయ పార్టీ ప్రాబల్యం క్రమంగా పెరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)