చేసిన పనికి జీతం అడిగినందుకు యాజమానురాలి దాష్టీకం !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని మోర్బి నగరంలో చేసిన పనికి జీతం అడిగినందుకు యాజమానురాలు దళిత వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించింది. సోదరుడు, సిబ్బందితో కలిసి కొట్టడంతోపాటు అతడి నోటిలో చెప్పు ఉంచింది. బాధితుడి ఫిర్యాదుపై ఆ మహిళతోపాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 21 ఏళ్ల దళిత యువకుడు నీలేష్ దల్సానియా అక్టోబర్‌లో రాణిబా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన టైల్స్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ.12,000 జీతం చెల్లిస్తామని ఆ కంపెనీ చెప్పింది. కాగా, అక్టోబర్‌ 18న అకస్మాత్తుగా నీలేష్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో 16 రోజులపాటు చేసిన పనికి జీతం ఇవ్వాలని అతడు డిమాండ్‌ చేశాడు. ఆ కంపెనీ పట్టించుకోకపోవడంతో బుధవారం సోదరుడు, మరో వ్యక్తితో కలిసి ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. చేసిన పనికి జీతం ఇవ్వాలని అడిగాడు. ఈ నేపథ్యంలో యజమానురాలు విభూతి పటేల్ అలియాస్‌ రాణిబా, ఆమె సోదరుడు ఓం పటేల్‌, సిబ్బంది కలిసి వారిని బెల్ట్‌తో కొట్టారు. ఈ సందర్భంగా నీలేష్‌ పట్ల విభూతి దారుణంగా ప్రవర్తించింది. అతడి చెంపపై కొట్టడంతోపాటు టెర్రస్ వద్దకు ఈడ్చుకెళ్లింది. అతడి నోటితో చెప్పును బలవంతంగా తీయించింది. జీతం అడిగినందుకు క్షమాపణ చెప్పమని డిమాండ్‌ చేసింది. డబ్బులు డిమాండ్‌ చేసేందుకు అక్కడికి వచ్చినట్లుగా చెప్పించి వీడియో రికార్డ్‌ చేసింది. మరోసారి ఆ ప్రాంతంలో కనిపిస్తే చంపుతానని బెదిరించింది. మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గాయపడిన నీలేష్‌ను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనపై పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. దీంతో యజమానురాలు విభూతి పటేల్, ఆమె సోదరుడు సహా ఆరుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోసహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)