భారత్ కు ఇబ్బందికరంగా చైనా ఎత్తులు ?

Telugu Lo Computer
0


భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతుండగానే  మన దేశానికి పొరుగున ఉన్న దేశాలతో డ్రాగన్ దేశం పెంచుకుంటున్న బంధం ఇప్పుడు కలవరపెడుతోంది. తాజాగా భూటాన్ విదేశాంగమంత్రి థాండీ దోర్జీ చైనాలో పర్యటించడంతో పాటు ఆ దేశ ఉపాధ్యక్షుడు, విదేశాంగమంత్రులతో భేటీ కావడం భారత్ లో ఆందోళన పెంచుతోంది. భూటాన్ తో సరిహద్దు వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకే చైనా ఈ ఎత్తులు వేస్తుందన్న చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. భూటాన్ తో చైనాకు దశాబ్దాలుగా సరిహద్దు వివాదం ఉంది. భారత్ తరహాలోనే భూటాన్ తోనూ చైనా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంటుంది. కానీ అకస్మాత్తుగా భారత్ కోణంలో ఈ వివాదాన్ని మార్చి సెటిల్ చేసుకుందామంటూ భూటాన్ కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు దౌత్య బంధాన్ని పటిష్టం చేసుకునే దిశగా చైనా అడుగులేస్తోంది. దీంతో భూటాన్ విదేశాంగమంత్రి తాండీ దోర్జీ బీజింగ్ లో పర్యటించారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, విదేశాంగమంత్రి వాంగ్ యీతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ముఖ్యంగా చైనా-భూటాన్ సరిహద్దు వివాదాన్ని సెటిల్ చేసుకునే అంశంపైనే చర్చించారు. అలాగే ఇరుదేశాల మధ్య దౌత్య బంధం పటిష్టం చేసుకునే అంశంపైనా మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ అప్రమత్తం అయింది. ఈ రెండు దేశాల సరిహద్దు వివాదం సెటిల్ అయితే చైనా-భూటాన్ మిత్రులుగా మారిపోవడం ఖాయం. ఇప్పటికే సరిహద్దుల్లో మన దేశానికి సమస్యలు సృష్టిస్తున్న చైనా.. ఇప్పుడు పాకిస్తాన్, భూటాన్, శ్రీలంక వంటి మన పొరుగుదేశాల్ని కూడా తమవైపు తిప్పుకుంటూ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. చైనాతో చర్చల తర్వాత భూటాన్ విదేశాంగమంత్రి ఇరుదేశాలూ సరిహద్దుల్లో మార్కింగ్ చేసుకోవడంతో పాటు దౌత్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అలాగే చైనాతో వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అలాగే చైనా కూడా భూటాన్ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవిస్తుందని ప్రకటన చేసింది. దీంతో ఈ వ్యవహారం ఎంత వరకూ వెళ్తుందో తెలుసుకున్నాకే తదుపరి చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్దమవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)