ధన బలాన్ని పూర్తిగా నియంత్రించాలి !

Telugu Lo Computer
0


యిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల పరిశీలకులతో సమావేశమైంది. ఎన్నికల్లో ధన బలాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఈ సందర్భంగా అబ్జర్వర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని, ధన బలాన్ని పూర్తిగా కట్టడి చేయాలని పరిశీలకులకు నిర్దేశించినట్లు సీఈసీని ఉటంకిస్తూ ఓ వార్తాసంస్థ తెలిపింది. మరోవైపు.. అబ్జర్వర్లను ఎన్నికల కమిషన్‌కు 'కళ్లు, చెవులు'గా పేర్కొంటూ ఎన్నికల సంఘం ట్వీట్‌ చేసింది. పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ఈ సమీక్ష జరిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధన, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. త్వరలోనే తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపింది. దీంతో త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)