చంద్రయాన్ 3 పేరుతో రేషన్ డీలర్ల దగా !

Telugu Lo Computer
0


జార్ఖండ్ రాష్ట్రంలోని చత్రా జిల్లాలో చంద్రయాన్ 3 పేరుతో రేషన్ డీలర్లు మోసానికి తెరలేపారు. చంద్రయాన్ 3కి కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను పేర్కొంటూ లబ్దిదారుల నిర్ణీత కోటాలో 5 నుంచి 10 కిలోల వరకు రేషన్ సరుకులను డీలర్లు తగ్గించారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు రావాల్సిన రేషన్‌లో 5 నుంచి 10 కిలోల వరకు మినహాయించి ఇస్తున్నారని ఆరోపిస్తూ చత్ర జిల్లాలోని పలు గ్రామాల ఉచిత రేషన్ లబ్దిదారులు అధికారులను ఆశ్రయించారు. సబ్‌ డివిజనల్‌ అధికారి (ఎస్‌డీఓ) సుధీర్‌ కుమార్‌ దాస్‌ను సంప్రదించి రేషన్‌ డీలర్లపై చర్యలు తీసుకోవాలని లబ్దిదారులు డిమాండ్‌ చేశారు. చంద్రయాన్ 3కి కేంద్రం చేసిన ఖర్చులను భర్తీ చేసేందుకు రేషన్ సరఫరాలో ప్రభుత్వం కోత విధించిందని డీలర్లు చెప్పినట్లు లబ్దిదారులు తెలిపారు. లబ్దిదారుల ఫిర్యాదు మేరకు జిల్లా యంత్రాంగం ఆరుగురు రేషన్ డీలర్లను సస్పెండ్ చేసింది. మరో 24 మందికి పైగా డీలర్లను వివరణ కోరినట్లు సమాచారం. చంద్రయాన్-3 మిషన్‌కు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును సాకుగా చూపుతూ తమ గ్రామంలో రేషన్ డీలర్లు నిర్ణీత కోటా సరుకుల్లో కోత విధించారని పంచాయతీ చీఫ్ ఉమేష్ రామ్ తెలిపారు. రేషన్ పథకం లబ్ధిదారులు మొదట రేషన్ కోతను అంగీకరించారని, అయితే డీలర్లు కోతకు గల కారణం చెప్పినప్పటి నుంచి వారు కోపంగా ఉన్నారని స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు రవీంద్ర సింగ్ పేర్కొన్నారు. అలాగే డీలర్లపై చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తే నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు. జిల్లా సీనియర్ అధికారిని కలిసి రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రతినిధి బృందం కూడా డిమాండ్ చేసింది. అయితే డీలర్లు మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. రేషన్ సరఫరాలో ఎలాంటి కోత విధించలేదని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)