రాజ్‌ఘాట్‌ పరిసరాల్లో ట్రాక్టర్‌తో పెట్రోలింగ్‌ !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈనెల 9-10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలు దేశాల నేతలు స్వయంగా హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధాని నగరాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిఘా కెమెరాలతో డేగ కన్ను వేశారు. డాగ్‌ స్క్వాడ్స్‌ను కూడా రంగంలోకి దింపారు. సమ్మిట్‌ జరిగే ప్రదేశంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్‌ఘాట్‌ లేక్‌ ప్రాంతంలో పోలీసులు ట్రాక్టర్‌ సాయంతో పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. మరోవైపు జీ20 సమ్మిట్‌ను దృష్టిలో పెట్టుకొని రైల్వేస్టేషన్‌లో వచ్చి పోయే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల ప్రతి బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మధుర రోడ్, బహెయిరాన్ రోడ్డు, పురానా ఖిల్లా రోడ్, ప్రగతి మైదాన్ మార్గాల్లో గూడ్స్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, లోకల్ బస్సులకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలు సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయన్నారు. పాలు, కూరగాయలు, పండ్లు, మెడికల్‌కు సంబంధించిన వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ట్యాక్సీలకు అసలు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ను కూడా అనుమతించట్లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)