బిజెపి బెదిరింపులకు భయపడం !

Telugu Lo Computer
0


బిజెపి బెదిరింపులకు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు భయపడరని వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా సోమవారం వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను కూలదోసి బిజెపి అధికారం చేపడుతోందని, అయితే అవి దీర్ఘకాలం కొనసాగలేవని అన్నారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అవినీతిపై ట్వీట్‌ చేసిన ప్రియాంకగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌నాథ్‌, పార్టీ నేత అరుణ్‌ యాదవ్‌లపై రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఐఆర్‌పై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా స్పందించారు. బిజెపి చర్యకు తాను ఆశ్చర్యపోలేదని అన్నారు. కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లోనూ కమిషన్‌ తీసుకుంటోందని, ఇది వారి పద్ధతి అని ఎద్దేవా చేశారు. బిజెపి యేతర ప్రభుత్వాలను పడగొట్టి తమ సొంత పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, కానీ ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదని, ప్రజలు తిరుగుబాటుతో వారికి బుద్ధి చెప్పి తీరుతారని అన్నారు. బిజెపి ఫిర్యాదులకు సోనియా, రాహుల్‌, ప్రియాంకలు భయపడరని స్పష్టం చేశారు. చట్టపరంగా లేదా దర్యాప్తు సంస్థలు లేదా ఏదో విధంగా తమను అణిచివేసేందుకు యత్నిస్తోందని అన్నారు. తమపై ఎంత ఒత్తిడి తీసుకువస్తే.. తాము అంత బలంగా పైకి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, కాంట్రాక్టర్ల నుండి 50 శాతం కమిషన్‌ తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. 50 శాతం కమిషన్‌ చెల్లించిన తర్వాతే చెల్లింపులు అందుతున్నాయని మధ్యప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్ల యూనియన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను కూడా ప్రియాంక తన ట్వీట్‌కి జత చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)