సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేస్తాం !

Telugu Lo Computer
0


స్సాంలో అమల్లో ఉన్న వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణ అంశంపై సీఎం హిమంత బిశ్వశర్మ  కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 చివరి నాటికి అస్సాం నుంచి AFSPAని పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గువాహటిలో ఆయన ప్రసంగించారు. '' ఈ ఏడాది చివరి నాటికి ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం అమలును పూర్తిగా రద్దు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మునుపటి ప్రభుత్వాలు ఈ చట్టాన్ని మిగతా జిల్లాలకు కూడా విస్తరించాలని కేంద్రాన్ని 62 సార్లు అభ్యర్థించాయి. కానీ, మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది.'' అని హిమంత బిశ్వశర్మ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో 4 సార్లు శాంతి ఒప్పందాలు చేసుకున్నానని బిశ్వశర్మ తెలిపారు. దాదాపు 8వేల మంది మిలిటెంట్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. అస్సాంని డ్రగ్స్‌ రహిత, అవినీతి రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని రూపుమాపేందుకు తన ప్రభుత్వం పటిష్ఠమైన చట్టాన్ని తీసుకొస్తుందని అన్నారు. ప్రస్తుతం అస్సాంలోని ఎనిమిది జిల్లాలు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం- 1958 పరిధిలోనే ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక భద్రతా దళాలకు కల్లోలిత ప్రాంతాల్లో ఎలాంటి వారెంట్లు లేకుండానే సోదాలు జరపడం, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, అవసరమైతే కాల్పులు జరపడం వంటి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఈ చట్టం కింద ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడినా- వారిపై చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ చట్టం అమలులో ఉన్నచోట ఆత్యయిక స్థితి ఉన్నట్లే. అయితే, ఈ అధికారాలను దుర్వినియోగపరుస్తూ సామాన్య పౌరులపై దారుణాలకు పాల్పడుతున్నట్టుగా అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే ఈ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మణిపూర్‌కు చెందిన ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)