తొలి ఓపీనియన్ పోల్ లో బీజేపీపై కాంగ్రెస్‌దే పై'చేయి'!

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీపీ సీఓటర్ సర్వే తొలి ఓపీనియన్ పోల్ 2023 ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని తేలింది. 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని పేర్కొంది. ఏబీపీ-సీఓటర్ సర్వే ప్రకారం.. అధికార బీజేపీకి 106-118 సీట్లు వచ్చే అవకాశం ఉందని.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 108-120 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) బోణీ చేయనుందని.. ఆ పార్టీకి 1-4 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే తెలిపింది.

ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 44 శాతం ఓటు షేర్ దక్కించుకోనున్నాయని తెలిపింది. కాగా, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 109 సీట్లు సాధించగా.. మ్యాజిక్ ఫిగర్‌కు ఏడు సీట్లు తక్కువయ్యాయి. 114 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ కూడా మెజార్టీకి రెండు సీట్లు తక్కువయ్యాయి. అయితే, ఒక ఎస్పీ ఎమ్మెల్యే, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుగా 15 ఏళ్ల తర్వాత కమల్‌నాథ్ నాయకత్వంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఒక ఏడాది తర్వాత కమల్‌నాథ్ సర్కారు కూలిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

కాగా, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేయనున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ, ఆప్ పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ విపక్షాల కూటమికి బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)