ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందువులకు వర్తింప చేయాలి !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో  ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశంలో రెండు చట్టాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మతి (కామన్ సివిల్ కోడ్) అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యల్ని కాంగ్రెస్, డీఎంకే, ఎంఐఎం సహా పలు పార్టీలు ఖండించాయి. ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయా పార్టీల నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్.. ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందువులకే వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు వారు గుళ్లలో పూజలకు అన్ని వర్గాల ప్రజలకు అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. హిందూ మతంలో ఉమ్మడి పౌరస్మృతి మొదట ప్రవేశపెట్టాలని, షెడ్యూల్డ్ కులాలు, తెగలతో సహా ప్రతి వ్యక్తి దేశంలోని ఏ దేవాలయంలోనైనా పూజలు చేయడానికి అనుమతించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రతి మతానికీ రక్షణ ఇచ్చిందని, కాబట్టి తమకు ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదని డీఎంకే నేత ఇళంగోవన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మండిపడింది. దేశంలోని పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి ముందుగా ఆయన సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు. మణిపూర్ సమస్యపై ఆయన ఎప్పుడూ మాట్లాడరని, రాష్ట్రమంతా తగలబడుతోందని అన్నారు. ఈ సమస్యలన్నింటి నుంచి ప్రజలను మళ్లించేలా ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. అంతకు ముందు ప్రధాని మోడీ ఉమ్మడి పౌరస్మృతి అమలు అవసరాన్ని చెబుతూ..ఒక కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధనలను కలిగి ఉండటం పనికిరాదన్నారు. రెండు చట్టాలతో దేశం ముందుకు సాగదన్నారు. ట్రిపుల్ తలాక్ అనేది ఇస్లాంలో విడదీయరాని భాగమైతే, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)