తీరాన్ని తాకిన పెను తుఫాను

Telugu Lo Computer
0


అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ 'బిపార్జాయ్' గుజరాత్ తీరాన్ని తాకింది. గుజరాత్ లోని జఖౌ ఓడరేవు సమీపంలో, పాకిస్తాన్ లోని కరాచీ తీరాల మధ్య తుఫాన్ తీరాన్ని దాటుతోంది. ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో బలమైన గాలులతో వర్షాలు ప్రారంభమయ్యాయి. తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఈ తీరందాటే ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) తెలిపింది. పోర్ బందర్, ద్వారక, జామ్ నగర్, మోర్బీ జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం అలలు 3-6 మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి. సైక్లోన్ ఐ ప్రాంతం దాదాపుగా 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్నట్లు అదికారులు తెలిపారు. ఇది ఈ అర్థరాత్రి తీరాన్ని తాకుతుందని తెలిపారు. తుఫాన్ మధ్యలో ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ' సైక్లోన్ ఐ'గా పేర్కొంటారు. తుఫాన్ ముందుగా విధ్వంసం సృష్టించిన తర్వాత ఈ కంటి ప్రాంతం తీరాన్ని దాటుతుంది. ఆ సమయంలో ఎలాంటి గాలులు, వర్షం లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆ తరువాత తుఫాన్ కు సంబంధించిన దట్టమైన మేఘాలతో కూడిన అల్పపీడన ప్రాంతం, ప్రచండ గాలులతో మరోసారి విధ్వంసం సృష్టిస్తూ తీరాన్ని దాటుతుంది. అయితే ప్రశాంతంగా ఉందని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ప్రశాంతం తరువాత మరోసారి వర్షం, గాలులు విరుచుకుపడుతాయని తెలిపారు. గుజారాత్ రాష్ట్రంలోని మాండ్వీ, పాకిస్తాన్ లోని కరాచీల మధ్య తుఫాన్ తీరం దాటుతోంది. గుజరాత్ లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలను తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా లక్ష మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత శిబిరాలకు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)