జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయి !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావలసినవి వస్తున్నాయని, నిధులు ఇస్తే ఇచ్చారని, ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. సీబీఐ అనేది స్వతంత్ర సంస్థ.. దానిపై ఎవరి ప్రభావం ఉండదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, అమిత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, అమిత్ షాను ఎవరైనా కలవచ్చని తెలిపారు. పొత్తులు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. కాగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా ఇవాళ విశాఖ నగరానికి వస్తున్నారు. శ్రీకాళహస్తిలో శనివారం జరిగిన సభకు నడ్డా హాజరు కాగా.. విశాఖ సభకు అమిత్‌ షా వస్తున్నారు. ఇక్కడి రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఈ సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ప్రధాని హోదాలో మోడీ 2019లో వచ్చినప్పుడు కూడా ఇదే గ్రౌండ్‌లో బీజేపీ సభ నిర్వహించింది. ఇప్పుడు అక్కడే అమిత్‌ షా విశాఖ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభకు అమిత్ షా తమిళనాడు నుంచి బయలుదేరి సాయంత్రం వస్తారని జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి తెలిపారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మాట్లాడతారు.. ఆ తరువాత పోర్టు అతిథి గృహానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించింది. అనంతరం అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్లిపోతారు. పార్టీ ఆదేశిస్తే విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆమె అన్నారు. అమిత్ షా పొత్తులపై ఎలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని తెలిపారు. పొత్తులపై బీజేపీ అధిష్టానం స్పష్టం చేస్తుందని పురందేశ్వరి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)