ఇద్దరు కూతుళ్లు విడాకులు తీసుకుని నిత్యానందతో పాటే ఉన్నారు !

Telugu Lo Computer
0


సీనియర్‌ నటుడు అశోక్‌ కుమార్‌ గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు వంటి సూపర్‌ హిట్స్‌ చిత్రాల్లో నటించారు. ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న ఆయన సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు. నచ్చని పెళ్లితో మొదట్లో తిప్పలు పడ్డ ఆయన తర్వాత భార్యను అక్కున చేర్చుకున్నారు. కానీ వారి సంతానమే తనకు తలవంపులు తెచ్చిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 'మొదట నేను పోలీసాఫీసర్‌గా పని చేశాను. కానీ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఓ హోటల్‌ నడిపాను. అందులో నష్టాలు రావడంతో అక్కడికి వెళ్లడమే మానేశాను. అది ఇంకా దివాలా తీయడంతో మా బావగారు వచ్చి ఆ హోటల్‌ చూసుకున్నారు. ఖాళీగా ఎందుకు ఉండటమని మద్రాసు వెళ్లాను. విలన్‌గా, సహాయ నటుడిగా సినిమాలు చేశాను. రామానాయుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నారు. చివరకు అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహా వల్ల నన్ను తీసేసి జగ్గయ్యను హీరోగా పెట్టారు. ఇలా కొన్ని సంఘటనలు జరగడంతో నా ఆత్మాభిమానం దెబ్బతింది. ఇలాంటి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? ఇక్కడికి వచ్చి తప్పు చేశానేనని ఫీలయ్యాను. ఈ సినీ ఇండస్ట్రీకి నేను పనికి రాను అని అర్థమైంది. అందుకే సినిమాలు మానేశాను' అని చెప్పుకొచ్చారు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ 'నా కుటుంబమే నాకు శత్రువు. అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. తీరా మండపంలో చూశాక ఆమె నాకు నచ్చలేదు. కానీ చేసేదేం లేక మనసొప్పకపోయినా పెళ్లి చేసుకున్నాను. ఈ కారణం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేశాను. కొన్నాళ్లకు తప్పు తెలుసుకున్నాను. నా వల్ల అమ్మాయిని బాధపడుతోందని తనను నాతోపాటే మద్రాసుకు తీసుకొచ్చాను. మాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద చదువులు చదివించాను. ముగ్గురికీ పెళ్లి చేశా. ఇద్దరికి విడాకులయ్యాయి. రెండో అమ్మాయి రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. నాకది నిజమో, కాదో తెలియదు. వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలయితే ఉన్నాయి. ఒక్కటైతే నిజం నిత్యానంద వల్లే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి విడాకులిచ్చింది. కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి  నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను. నా కోపాన్ని, బాధను అర్థం చేసుకునేవాళ్లే లేరు. నిత్యానంద మాయలో పడి నా ఇద్దరు కూతుళ్లు అతడి వెంటే వెళ్లారు. ఇప్పటికీ అతడితోనే ఉన్నారు. ఇదంతా భరించలేక నా భార్య అనారోగ్యానికి గురై మరణించింది. నా మూడో కూతురే నన్ను చూసుకుంటోంది. మిగతా ఇద్దరూ ఇంతవరకు నాకు ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు' అని ఎమోషనలయ్యారు అశోక్‌ కుమార్‌.

Post a Comment

0Comments

Post a Comment (0)