మణిపూర్‌లో మూడు గంటల పాటు కర్ఫ్యూ సడలింపు !

Telugu Lo Computer
0


మణిపూర్‌లో ఆదివారం అల్లర్లతో ప్రభావితమైన చురాచంద్‌పూర్‌ పట్టణంలో ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆహారం, మందులతో పాటు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆర్మీ డ్రోన్స్‌, హెలికాఫ్టర్‌లతో ఏరియల్‌ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. కర్ఫ్యూ సడలింపు ముగిసిన వెంటనే ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ కాలమ్స్‌ చురాచంద్‌పూర్‌లో మార్చ్‌ చేపట్టాయి. మణిపూర్‌లో సుమారు 10,000 మందికి పైగా సైనికులు, పారామిలటరీ మరియు కేంద్ర పోలీసు బలగాలను మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక్క చురాచంద్‌పూర్‌లోనే 120-125 ఆర్మీ కాలమ్స్‌ను మోహరించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. శాంతి నెలకొనేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ శాంతి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ ప్రకటించారు. ఇప్పటివరకు అన్ని వర్గాలకు చెందిన 23,000 మందిని రక్షించామని, వారిని మిలటరీ శిబిరాలకు తరలించామని అన్నారు. మైతీ కమ్యూనిటీకి ఎస్‌టి హోదా కల్పించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో చేపట్టిన 'ఆదివాసి సంఘీభావ యాత్ర ' లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)