నోట్లను మార్చుకోవడానికి దారులు వెతుకుతున్న బడా బాబులు !

Telugu Lo Computer
0


రూ.2వేల నోటు ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్లు సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే చలామణిలో ఉంటాయి. ఆ తరువాత రూ. 2వేల నోట్లు చెల్లుబాటు కానివిగా భావించడం జరుగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈలోపు రూ. 2వేల నోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చని సూచించింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయం సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే, రూ. 2 వేల నోట్ల రద్దు నేపథ్యలో ప్రజలు తమ వద్ద నోట్లను మార్చుకొనేందుకు పలు దారులను వెతుకుతున్నారు. ముఖ్యంగా బడా బాబులు 2వేల నోట్లు వదిలించుకొనేందుకు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ముబైలోని బడా బాబులు రూ. 2వేల నోట్లు ఇచ్చి బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న గోల్డ్ వ్యాపారులు 2,000 నోట్లు తీసుకొని అధిక ధరకు బంగారాన్ని విక్రయాలు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం బంగారాన్ని అనధికారిక మార్కెట్ లో దాదాపు రూ. 67వేలు ( 10 గ్రాములు) రూ. 2వేల నోట్లతో కొందరు గోల్డ్ వ్యాపారులు విక్రయాలు చేశారు. బంగారం ధర అధికారికంగా ముంబైలో రూ. 63,800 (జీఎస్టీతో కలిపి) ఉంది. అయితే, బడా బాబులు తమ వద్ద ఉన్న రెండువేల నోట్లు వదిలించుకొనేందుకు బంగారం వ్యాపారులకు 2వేల నోట్లు ఇచ్చి అధిక ధరకు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. 2వేల నోట్లు ఎక్కువ మొత్తంలో నిల్వచేసుకున్న బడా బాబులు బ్యాంకులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే పన్ను చెల్లింపు చేయాల్సి ఉంటుందని, ఇతర మార్గాల ద్వారానే రూ. 2వేల నోట్లు మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. గోల్డ్ తరువాత.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ, దేవాలయాలు, మత సంస్థల ద్వారా నగదును మార్పిడి చేసుకొనే ప్రయత్నాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని మార్కెట్ వర్గాల సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)