అక్రమ సంబంధమే కడతేర్చింది !

Telugu Lo Computer
0


హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్​స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీన కమల ప్రసన్ననగర్ కాలనీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో జిమ్ కోచ్ జయకృష్ణ మంటల్లో కాలి మృతి చెందాడు. మొదటగా అందరూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. కానీ మృతుడి తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లోతైన విచారణ చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం కొనసాగించేందుకు అడ్డుగా ఉన్నాడని జయకృష్ణను అతడి భార్య దుర్గాభవాని తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడు చిన్నా, మృతుడి భార్య దుర్గా భవాని ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాకు చెందిన జయకృష్ణ (36) 20 ఏళ్ల క్రితం బతకుదెరువు కోసం హైదరాబాద్​కు వచ్చాడు. ఇక్కడ జిమ్ కోచ్​గా జీవనం సాగిస్తున్నాడు. దుర్గా భవాని అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యా పిల్లలతో కలిసి కమల ప్రసన్ననగర్​లో గది అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. నగరంలో జిమ్ ట్రైనర్​గా పని చేసే జయకృష్ణ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో హత్యకు వారం రోజుల ముందు హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని భార్యకు తెలిపాడు. అనంతరం జయకృష్ణ.. భార్యా పిల్లలను గ్రామంలో వదిలేసి  తండ్రితో కలిసి నగరానికి వచ్చాడు. భార్య దుర్గాభవానికి గ్రామానికి వెళ్లేందుకు ఇష్టం లేదు. జయకృష్ణతో పాటు పని చేసే మరో జిమ్ ​కోచ్ చిన్నాతో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. గ్రామానికి వెళ్లిపోతే తమకు ఇబ్బంది కలుగుతుందని, ఎలాగైనా జయకృష్ణ అడ్డు తొలగించుకోవాలని చిన్నా, దుర్గా భవాని పథకం వేశారు. ఆ ప్రకారం జయకృష్ణ నగరానికి రాగానే అతనితో చిన్నా బాగా మద్యం తాగించాడు. అనంతరం ఇంట్లో హత్య చేసి బెడ్​రూమ్​లో పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే యత్నం చేశారు. గడియ పెట్టడంతో మిస్టరీ బయటకు..: ఈ ఘటనలో ఇంటి బయట నుంచి గడియ పెట్టడం అనుమానాలకు తావిచ్చింది. మొదటగా అందరూ ఆత్మహత్య అనుకున్నప్పటికీ బంధువుల ఇంటికి వెళ్లిన జయకృష్ణ తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టగా.. విస్తుపోయే నిజాలు బహిర్గతం అయ్యాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు చిన్నా, భార్య దుర్గాభవాని ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)