ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు : నలుగురు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ ఖానాపురం గ్రామంలోని పోచమ్మ దేవాలయ సమీపంలో శుక్రవారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. వివిధ కాలేజీల్లో ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేశారు. అందరూ టీనేజర్లే. వీరిలో దివ్య అనే అమ్మాయి పెండ్లి కుదిరింది. బ్యాచిలర్‌ పార్టీకి స్నేహితులంతా సిద్ధమయ్యారు. గండిపేటలోని ఓషియన్‌ పార్కుకు వెళ్లాలని ఒక్కరోజు ముందే నిర్ణయించుకున్నారు. స్నేహితుల్లో ఒకరు బైక్‌ మెకానిక్‌ కావడంతో కారు తీసుకొచ్చాడు. ఎనిమిది మంది కూర్చొనే కారులో 11 మంది సర్దుకొన్నారు. పార్టీని ఎంజాయ్‌ చేయాలనే తలంపుతో రయ్‌న కారులో దూసుకెళ్తున్నారు. రోడ్డుపై ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయి స్పీడ్‌ను నియంత్రించలేక రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. కారులో ముందు కూర్చున్న అంకిత(16), నితిన్‌(17), వెనుక సీట్లో కూర్చున్న అంకిత అక్క అర్షిత(17) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చికిత్స పొందుతూ తాటి అమృత్‌ (25) ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. మిగతా నలుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ని జాంపేట వాసులు. శివారెడ్డి ఇద్దరు కూతుళ్లు అంకిత, అర్షితను ఒకేసారి మృత్యువు కబళించడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)