కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా రాష్ట్రంలోని బీసీ కుల వృత్తుల వారికి కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ. లక్ష సాయం అందిస్తారు. దీనికి ఇంకా ఏయే కులాలను పరిగణనలోకి తీసుకోవాలి. సొమ్మును సాయంగా ఇవ్వాలా, రుణం రూపేణా సబ్సిడీగా ఇవ్వాలా అనే అంశాలపై విధివిధానాలను రూపొందించేందుకు మంత్రి  గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి ఇందులో సభ్యులుగా ఉంటారు. 15 రోజుల్లోగా యాదవ, కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించాలని మంత్రివర్గం ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం నూతన సచివాలయంలో తొలిసారి జరిగిన మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు ప్రకటించింది. రాష్ట్రావతరణ ఉత్సవాలను జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించాలని, అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో సంబురాలు జరపాలని నిర్ణయించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను పూర్తిగా ఎత్తివేసింది. దాని పరిధిలోని 84 గ్రామాలకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిబంధనలు వర్తింపజేయాలని సూచించింది. గండిపేట, హిమాయత్‌సాగర్‌, మూసీ, హుస్సేన్‌సాగర్‌లకు గోదావరి జలాలను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. వడగళ్లు, అకాల వర్షాల ముప్పును నివారించేందుకు పంట కాలాన్ని నెల రోజుల ముందుకు జరపాలని నిర్ణయించింది. సమావేశం అనంతరం మంత్రి హరీశ్‌రావు సచివాలయంలో గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డిలతో కలిసి ఆ నిర్ణయాలను వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)