కొంపముంచిన చలానా !

Telugu Lo Computer
0


కేరళలో ఏప్రిల్ 25వ తేదీన ఒక వ్యక్తి తన మోటార్ సైకిల్‌పై మరో మహిళను ఎక్కించుకున్నాడు. హెల్మెట్ ధరించకుండా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంతో.. ఏఐ కెమెరాలు ఫోటో క్లిక్‌మనిపించాయి. ఆ వ్యక్తి భార్య పేరు మీద బండి రిజిస్ట్రేషన్ అయి ఉండటంతో ఆ ఫోటోతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘటనకు సంబంధించిన టెక్ట్స్ మెసేజ్ ఆమెకు వెళ్లింది. ఆ మెసేజ్‌తో పాటు మరో మహిళతో తన భర్త ఉన్న ఫోటోని చూసి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది వెంటనే భర్తను నిలదీసింది. ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు కేవలం లిఫ్ట్ మాత్రమే ఇచ్చానని సమాధానం ఇచ్చాడు. కానీ.. భర్తపై నమ్మకం లేకపోవడంతో, అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానించింది. ఇలా వారి మధ్య ఈ విషయంపై తరచూ గొడవలు జరిగాయి. మే 5వ తేదీన ఆ మహిళ తన భర్తపై కరమన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని శారీరకంగా హింసించడంతో పాటు తమ మూడేళ్ల కూతురిని కూడా వేధించాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోయినా ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతడ్ని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసు గురించి ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ  ఆ మహిళ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం, ఆమె భర్తను కస్టడీలోకి తీసుకున్నామన్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 321, 341, 294 మరియు 75 జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే  అతనితో పాటు బైక్‌ ఎక్కిన ఆ మహిళ ఎవరు? అన్నది ఇంకా తెలియరాలేదు. నిజంగానే అతని ప్రియురాలా? లేకపోతే అతడు చెప్తున్నట్టు లిఫ్ట్ ఇచ్చాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)