భారీ నగదుతో వెళుతూ నిలిచిన ఆర్బీఐ కంటైనర్లు !

Telugu Lo Computer
0


తమిళనాడు లోని చెన్నై నుంచి విల్లుపురం వెళ్లే రోడ్డులో బుధవారం ఓ భారీ కంటైనర్ నడిరోడ్డుపై ఉన్నట్టుండి నిలిచిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ వాహనం ముందుకు కదల్లేదు. ఆ కంటైనర్ వెనకాల మరో భారీ కంటైనర్ వస్తుండగా.. ముందు వెళ్తున్న కంటైనర్ ఆగడంతో అది కూడా అక్కడే ఆగింది. రెండు భారీ కంటైనర్లు ముందు వెనుక ఆగిపోవడంతో అటుగా వస్తున్న వాహనాలు కూడా నెమ్మదిగా ఆగి ఆగి ముందుకు సాగడం మొదలైంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఆగిన ఆ రెండు కంటైనర్లు రిజర్వ్ బ్యాంక్ పంపినవి. రెండు వాహనాల్లో కలిపి రూ.535 కోట్ల నగదు ఉంది. రెండు వాహనాల్లో డ్రైవర్లు కొంతమంది సిబ్బంది తప్ప ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏమీ లేదు. దీంతో వారందరి వెన్నులో వణుకు మొదలైంది. కంటైనర్లలో వందల కోట్ల నగదు ఉండటంతో ఎవరైనా అకస్మాత్తుగా దాడి చేస్తారేమోనని, కంటైనర్లలో ఉన్న డబ్బు దోచుకు వెళ్తారేమోనని ఆందోళన చెందారు. చివరికి వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి కంటైనర్లలో భారీగా నగదు ఉన్నట్టు చెప్పేశారు. దీంతో వందలాదిగా పోలీసులు అక్కడి చేరుకొని రెండు కంటైనర్లకు బందోబస్తు కల్పించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మామూలుగా ఒక శాఖ నుంచి మరో శాఖకు డబ్బు తరలించడం మామూలే. అయితే చాలా రహస్యంగా డబ్బును తరలిస్తుంటుంది. తమిళనాడు రాజధాని చెన్నై ఆర్బీఐ శాఖ నుంచి అదే రాష్ట్రంలోని విల్లుపురంలో ఉన్న శాఖకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 535 కోట్లను రెండు కంటైనర్లలో పంపింది. అవి చెన్నై నుంచి బయలుదేరిన కొన్ని గంటల తర్వాత నడిరోడ్డుపై నిలిచిపోయాయి. భారీ బందోబస్తు మధ్య నగదును విల్లుపురం ఆర్బీఐ శాఖకు తరలించారు. ఆగిన రెండు కంటైనర్లలో భారీగా నగదు ఉన్నట్లు తెలుసుకొని స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)