కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసింది !

Telugu Lo Computer
0


ఢిల్లీ ప్రభుత్వాధికారుల బదిలీల విషయంలో తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. 'నేషనల్ కెపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ'ని ఏర్పాటు చేసే ఆర్డినెన్స్. అది సుప్రీంకోర్టు ఉత్తర్వును కూడా తలకిందులు చేసింది. దానికి వ్యతిరేకంగా మద్దతు సంపాదించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశవ్యాప్త పర్యటన చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మంగళవారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ పోరాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ 'నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే కేంద్రం అన్ని అధికారాలు లాగేసుకుంది. మేము ఎనిమిదేళ్లుగా సుప్రీంకోర్టులో పోరాడి గెలిచాము. కానీ ఇప్పుడు వాళ్లు సుప్రీం కోర్టు వెకేషన్‌లోకి వెళ్లే ఒక రోజు ముందు ఆర్డినెన్స్ తెచ్చారు. వారు ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేశారు' అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ 'మేము సుప్రీంకోర్టును గౌరవిస్తాము. దేశాన్ని రక్షించేది సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక కూడా కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చింది. అన్ని పార్టీలకు నేను చేసే విన్నపం ఒకటే. అంతా ఒక్కటవ్వండి. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించండి. ఇదో పెద్ద అవకాశం. మేము దీనిని రాజ్యసభలో వ్యతిరేకిస్తాము' అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 'ఒకవేళ 30 మంది గవర్నర్లు, ప్రధాని దేశాన్ని నడిపేట్టయితే, ఇక ఎన్నికల వల్ల లాభం ఏమిటి? ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నరే ప్రభుత్వం అయితే ఇక ఢిల్లీ ప్రజలు ఓటెవరికి వేసినట్లు?' అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)