శరత్ బాబు కన్నుమూత

Telugu Lo Computer
0


ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమను కన్నీటి సాగరంలో ముంచి వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు మొదట బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఇతరత్రా అనారోగ్య సమస్యలు చోటుచేసుకోవడంతో ఆయన ఆరోగ్యం ఈరోజు విషమంగా మారింది. ఈరోజు మధ్యాహ్నం శరత్ బాబు ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. శరత్ బాబుకు ప్రస్తుతం 71 సంవత్సరాలు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. ఆమదాలవలస లో జన్మించిన ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. కానీ ఆయన కళ్ళ సమస్యల వల్ల పోలీస్ కాలేకపోయాడు. ఆ తర్వాత ఓ పేపర్ లో ఆడిషన్ ప్రకటన చూసి సినిమా యాక్టర్ గా ఆడిషన్ కు వెళ్ళిన ఆయన ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వం వహించిన అవరుగల్ సినిమా ద్వారా మొదట తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తెలుగులో ఇది కథ కాదు సినిమాగా బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆ సినిమాలో శరత్ బాబు, కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ వంటి గొప్ప నటులతో కలిసి నటించారు. ఆ సినిమాలో ఆయన వారికి దీటుగా తన నటనను ప్రదర్శించారు. ఆ తర్వాత ఆయన సినీ ప్రపంచంలో వెనక్కు తిరిగి చూడలేదు. తెలుగు సినిమా చరిత్రలో విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందిన ఆయన తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో నటించారు. మొత్తం 220 పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్ గా ను అనేక సినిమాలలో శరత్ బాబు విలక్షణ పాత్రలు పోషించారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో రామరాజ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన శరత్ బాబు చాలా హిట్ సినిమాలలో నటించారు. రామరాజ్యం, కన్నె వయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, చిలకమ్మ చెప్పింది, నీరాజనం, సీతాకోకచిలుక, ఓ భార్య కథ, సితార, అన్వేషణ, ఇది కథ కాదు, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో సినిమాలలో శరత్ బాబు తన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఆయన తన సినీ ప్రయాణంలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలో మొదట రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. ఆపై 1988లో ఆమెతో విడిపోయారు. మళ్ళీ శరత్ బాబు 1990 లో స్నేహా నంబియార్ ను పెళ్లి చేసుకున్నారు. ఆపై ఆమెకు 2011లో విడాకులు ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)