రేపు, ఎల్లుండి 'గో ఫస్ట్' విమానాలు రద్దు

Telugu Lo Computer
0


గోఫస్ట్ ఎయిర్‌వేస్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న ఈ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మే 3,4తేదీల్లో అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అమెరికాకు జెట్ ఇంజిన్ల తయారీదారు సంస్థ.. ఇంజిన్లు సరఫరా చేయకపోవడం వల్లే సంస్థకు ఈ పరిస్థితి వచ్చిందని 'గోఫస్ట్' సీఈవో కౌశిక్ తెలిపారు. ప్రాట్&విట్నీ ఇంజిన్లను సరఫరా చేయకపోవడంతో గోఫస్ట్ ఎయిర్‌వేస్ కష్టాల్లో పడింది. దీంతో దాదాపు 50 విమానాలను నిలిపివేయాల్సి వచ్చిందని కౌశిక్ ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం జెట్ ఇంజిన్ల సరఫరాను ప్రభావితం చేసిందని తెలిపారు. అంతేకాదు ఆయిల్ కంపెనీలకు బకాయిలు చెల్లించేందుకు నిధులు లేకపోవడంతో కష్టాల్లో పడింది. ఆయిల్ కంపెనీలు క్రిడిట్‌కు అంగీకరించకపోవడంతో ప్రతి విమానానికి రోజువారీగా నగదు చెల్లించి ఇంధనం కొనుగోలు చేస్తోంది. 2022లో అతిపెద్ద నష్టాలను చవిచూసిన గోఫస్ట్ ఎయిర్ వేస్.. అప్పటినుంచి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. గత నెలలో గోఫస్ట్ ఎయిర్ వేస్ యాజమాన్యం వాడియా గ్రూప్ మెజారిటీ వాటాను విక్రయించడానికి భాగస్వాములతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరగగా..గోఫస్ట్ సంస్థ వాటిని ఖండించింది. ప్రమోటర్లు తమతో వ్యాపారానికి కట్టుబడి ఉన్నారు. మరిన్ని నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. ఏప్రిల్ చివరి నాటికి ప్రమోటర్ ఈక్విటీ, బ్యాంక్ లోన్ల రూపంలో ₹600 కోట్లు నిధులు గోఫస్ట్ ఎయిర్‌వేస్‌కు సమకూరుతాయని తెలిపింది. మూడువేల మందికి పైగా ఉద్యోగులున్న ఈ విమానయాన సంస్థ ఫ్లైట్ల రద్దు విషయాన్ని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ కు వివరణాత్మక నివేదికను సమర్పించింది. దివాలా దరఖాస్తును అంగీకరించిన తర్వాత మాత్రమే తిరిగి రద్దు చేసిన విమానాలను ప్రారంభిస్తామని గోఫస్ట్ ఎయిర్‌వేస్ సీఈవో కౌశిక్ కోనా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)