గర్భిణులకు ఉచితంగా టిఫా స్కానింగ్ సేవలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు. సాధారణంగా ఈ టీఫా స్కాన్‌ను తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక్కో టిఫా స్కాన్‌కు రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. టిఫా స్కానింగ్‌ టెస్ట్ ద్వారా గర్భంలోని శిశువుల ఎదుగుదలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడేందుకు వీలు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తెలిపారు. రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లోనూ టిఫా స్కానింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణుల ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అనే ఉద్దేశ్యంతో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు, గర్భిణులకు మధ్య ఒక అనుబంధ వ్యవస్థ ఏర్పాటైనట్టు తెలిపారు. గర్భం ధరించిన 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో ఈ స్కానింగ్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణులకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలేమీ లేని వారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌లు చేస్తారు. గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌ చేయడానికి వీలుగా వివరాలను ఆన్‌లైన్‌లో పొందిపరిచామని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్ హరేంధిరప్రసాద్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)