ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ప్రత్యేక ఆర్దిక సాయం మంజూరు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ఆర్దిక సాయం కింద  కేంద్రం రూ 10,467.87 కోట్లు మంజూరు చేసింది. ఇదే నిధుల కోసం నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో పట్టించుకోని కేంద్రం  ఎన్నికల సంవత్సరంలో ఇప్పుడు సీఎం జగన్  ప్రభుత్వానికి విడుదల చేసింది. ఏపీలో ఉన్న ఆర్దిక కష్టాల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారీ ఉపశమనంగా మారనుంది. 2014- 15 ఆర్దిక సంవత్సరం నాటి రెవిన్యూ లోటు కింద రూ 10,460.87 కోట్లు విడుదలకు నిర్ణయించింది. ఈ నిధులను వెంటనే ఏపీ ప్రభుత్వానికి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ రెవిన్యూ లోటు కోసం చంద్రబాబు ప్రభుత్వం 2014-19 వరకు ఎన్నోసార్లు కేంద్రాన్ని అభ్యర్ధించింది. ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయం పైన ప్రధాని మోదీని కలిసి నిధులు విడుదలకు సహకరించాలని కోరారు. దీంతో ప్రధాని కార్యాలయ ఆమోదంతో నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా విడతల వారీగా అందించేవారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకే విడతలో ఇవ్వటం గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో కేంద్రం నుంచి అందిన ఈ సహకారం జగన్ ప్రభుత్వానికి ఊరటనివ్వనుంది. 2014-15 సంవత్సరానికి ఏపీ రెవిన్యూ లోటు భర్తీపై విభజన సమయంలో నాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు చెల్లించాల్సిన రెవిన్యూ లోటు రూ 16,078 కోట్లుగా తేల్చారు. అందులో భాగంగా కేంద్రం 2014-15 నుంచి 2016-17 వరకు విడతల వారీగా మొత్తంగా రూ 3,979.50 కోట్లు ఇచ్చింది. ఆ తరువాత మిగిలిన మొత్తం విడుదల కోసం అప్పటి ప్రభుత్వం ప్రయత్నించినా కాగ్ లెక్కలను సమర్పించినా.. కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. రెవిన్యూ లోటు నిధుల కు సంబంధించి కేంద్రం - ఏపీ ప్రభుత్వం మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రధాని మోదీతో సమాేవశమైన సమయంలో రెవిన్యూ లోటు భర్తీకి సంబంధించిన నిధుల పైన చర్చించారు. దీంతో ప్రధాని కార్యాలయం మేరకు కేంద్ర ఆర్దిక శాఖ ఈ నిధులకు సంబంధించి వివరాలు కోరింది. 2014-15, అంతకుముందు సంవత్సరాలకు సంబంధించి ఏ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి..ఏ బిల్లులు ఎంత చెల్లించలేదని సమాచారాన్ని రికార్డుల ఆధారంగా పంపాలని సూచించింది. దీంతో, ఇప్పుడు కేంద్రం నుంచి ఇతర పద్దుల కింద రావాల్సి ఉన్న నిధుల విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర నిర్ణయాలు జగన్ సర్కార్ కు కలిసి రానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)