గోరఖ్ పూర్, వారణాసికి కీలక ఆఫీసుల తరలింపు !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాలనలో విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వ సేవల కార్యాలయాల్ని గోరఖ్ పూర్, వారణాసికి తరలించాలని యోగీ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సేవలకు సంబంధించిన అన్ని ప్రధాన కార్యాలయాలను గోరఖ్‌పూర్, వారణాసిలోని సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయాలకు మార్చాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రెండు జిల్లాల్లో కార్యాలయాల సముదాయాల నిర్మాణ పురోగతిని సమీక్షించిన సందర్భంగా ఆదిత్యనాథ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ సర్కార్ నిర్వహించే సచివాలయాల మాదిరిగానే డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో కూడా ఈ కాంప్లెక్స్‌ల అభివృద్ధి చేయాలని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. వారణాసి, గోరఖ్‌పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మాణ ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని, తమ ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని సిఎం యోగీ అదిత్యనాథ్ అధికారుల్ని కోరారు. సమీకృత కార్యాలయాల్లో ఆడిటోరియం, వీడియో కాన్ఫరెన్స్‌ రూమ్‌, పార్కింగ్‌ వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించాలని, పేపర్‌ లెస్‌ వర్కింగ్‌ను ప్రోత్సహించాలన్నారు. ప్రజలు ఇకపై వారి సంబంధిత పనుల కోసం వివిధ కార్యాలయాలకు వెళ్లే అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని యోగీ తెలిపారు. వీటికి అదనంగా ఇంటిగ్రేటెడ్ కార్యాలయ ఆవరణలు వివిధ కార్యాలయాల మధ్య మెరుగైన సమన్వయం, సహకారాన్ని సులభతరం చేస్తాయని యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. మరోవైపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోపు యూపీలో పాలనను పరుగులు తీయించడం ద్వారా ఓటర్లను ఆకర్షించాలని యోగీ పట్టుదలగా కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)