బంగారం @ 66000 !

Telugu Lo Computer
0


దేశంలో బంగారం, వెండి కొనుగోలుకు ప్రజలు పరుగులు తీయటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రిజర్వు బ్యాంక్ దేశంలో రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించటంతో చాలా మంది బులియన్ మార్కెట్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగుతున్నారని వెల్లడైంది. ఈరోజు నుంచి చాలా మంది తమ రూ.2000 నోట్లను బ్యాంకుల వద్ద మార్చుకునేందుకు ప్రజలు మెుగ్గుచూపే అవకాశం ఉంది. మోడీ సర్కార్ డీమానిటైజేషన్ పూర్తి చేసిన దాదాపు 7 ఏళ్ల తర్వాత రూ.2000 నోట్లను చలామణి నుంచి రిజర్వు బ్యాంక్ వెనక్కి తీసుకోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. నోట్లను వెనక్కి తీసుకోవటం కారణంగా ఏర్పడిన డిమాండ్ రేట్ల పెరుగుదలకు కారణంగా నిలుస్తోందని అనేక రాష్ట్రాల గోల్డ్ డీలర్లు తెలిపారు. నోట్లను ఉపసంహరణ తర్వాత పసిడి అమ్మకాలు పుంజుకున్నాయని లక్నో చౌక్ సర్రాఫా మార్కెట్‌లో బులియన్ డీలర్ వినోద్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే రూ.2000 నోట్లతో చెల్లింపులు చేసి బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తున్న వారి నుంచి దాదాపు 10 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నారని గోల్డ్ డీలర్లు చెబుతున్నారు. నోట్ల ఉపసంహరణ కారణంగా విక్రయాలు 10-20 శాతం మేర పెరిగినట్లు కోల్‌కతా మార్కెట్లోని వ్యాపారులు చెబుతున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002 ప్రకారం లైసెన్స్ పొందిన జ్యువెలరీ షాపు యజమానులందరూ జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,000 నుంచి 66,000కి పెరిగినట్లు జైపూర్‌లోని నగల దుకాణం యజమాని సౌరభ్ జైన్ తెలిపారు. ఇది బంగారం విక్రయాలకు మంచిది కాదని ఆయన అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు స్థిరమైన మార్కెట్ కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. అకస్మాత్తుగా ఏర్పడిన ధరల పెరుగుదల మంచిది కాదని అన్నారు. కేవలం బంగారం మాత్రమే కాక గృహోపకరణాలు వంటి విక్రయాలు సైతం నోట్ల ఉపసంహరణతో పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. హవాలా వ్యాపారులపై నిఘా ఉంచేందుకు కోల్‌కతా పోలీసులు బులియన్ మార్కెట్‌ల వద్ద నిఘా పెంచారు. తిరునెల్వేలిలోని తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు కండక్టర్లు ప్రయాణికుల నుంచి రూ.2,000 నోట్లను స్వీకరించకూడదని సర్క్యులర్ జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)