పెట్రోల్ బంకులకు రూ.2,000 నోట్ల తాకిడి !

Telugu Lo Computer
0

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రూ. 2,000 నోట్లను ఉపసంహరించడంతో వాటిని మార్చుకోవడానికి ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లో నగదు ద్వారా జరిగే ఇంధనం అమ్మకాలు దాదాపు 90 శాతం పెరిగాయి. గత శుక్రవారం రూ. 2,000 నోటు ఉపసంహరణ ప్రకటన వెలువడడానికి ముందు వరకు నగదు ద్వారా జరిగే ఇంధనం అమ్మకాలు కేవలం 10 శాతం మాత్రమే ఉండేవని పెట్రోల్ పంపు డీలర్లు తెలిపారు. కాని ఇప్పుడు రూ. 100, రూ. 200 పెట్రోల్ కొనుగోలు కోసం రూ. 2,000 నోటును ఇచ్చే కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని వారు చెప్పారు. ఈ కారణంగా తమకు చిల్లర నోట్ల కొరత ఏర్పడుతోందని వారు తెలిపారు. కస్టమర్ల సౌలభ్యం కోసం బ్యాంకులు తమ వద్ద నుంచి రూ. 2,000 నోట్లను తీసుకుని చిన్న నోట్లను ఇచ్చేందుకు ఆదేశాలు జారీచేయాలని వారు ఆర్‌బిఐని కోరారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడిందని, కస్టమర్లు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లను మార్పిడి చేసుకోవడానికి చిన్న మొత్తంలో పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారని, దీంతో చిన్న నోట్లకు కొరత ఏర్పడుతోందని అఖిల భారత పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ భన్సాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు డెబిట్, క్రెడిట్ కార్డు లేదా డిజిటల్ పేమెంట్ పద్ధతి పాటించాలని పెట్రోల్ డీలర్లు తమ కస్టమర్లను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)