హర్యానా, కేరళ, పుదుచ్చేరిల్లో మాస్క్‌లు తప్పనిసరి !

Telugu Lo Computer
0


హర్యానా, కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సూచించాయి. కేంద్రం ఆరోగ్య మంత్రి మన్షుక్ మాండవీయ గతవారంలో సమీక్షా సమావేశం జరిపి, రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. ఆరోగ్య సేవల సన్నద్ధతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచనలు చేశారు. ఆ వెనువెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ అధికారిలతో పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రిపేర్డ్‌నెస్‌ను అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో మాక్ డ్రిల్‌ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు మళ్లీ పెరుగుతున్నందున పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్రిటికల్ కేర్ ఏర్పాట్లు అందుబాటులో ఉంచుతున్నామని, ఏర్పాట్ల సన్నద్ధతపై వారంవారం సమీక్షిస్తున్నామని చెప్పారు. నాలుగో వేవ్‌కు అవకాశాలపై మంత్రిని అడిగినప్పుడు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని అన్నారు. ఇంతవరకూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 వేరియంట్ చివరిది కాగా, కొత్తగా ఇప్పుడు XBB1.16 సబ్ వేరియంట్‌ కోవిడ్ కేసుల పెరుగదలకు కారణమవుతోందని, తమ మంత్రిత్వ శాఖ అనుభవం ప్రకారం సబ్-వేరియంట్లు మరీ అంత ప్రమాదం కావని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)