ప్రజలే శివుళ్లు, నాగేంద్రుడిలా వారి వెన్నంటి ఉంటా !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనపై చేసిన ‘విష సర్పం’ వ్యాఖ్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. పరమేశ్వరుని మెడలో హారం నాగుపామని, తన వరకూ ప్రజలే శివుళ్లనీ, నాగేంద్రుడిలా వారి వెన్నంటి ఉండేందుకు తాను సిద్ధమంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, జేడీయూ పార్టీలపై ప్రధాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ రెండూ కుటుంబ పార్టీలేనని మోడీ విమర్శించారు. భారతదేశానికి గ్రోత్ ఇంజన్ కర్ణాటక రాష్ట్రమని, అస్థిర ప్రభుత్వం ఏర్పడటం మంచిది కాదని సూచించారు. అస్థిర ప్రభుత్వం వల్ల అభివృద్ధి జరగదని, ప్రజలను లూటీ చేస్తారని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాలు ఉన్నప్పడు కొన్ని ప్రత్యేక కుటుంబాలే అభవృద్ధి చెందాయని, బీజేపీకి మాత్రం ఈ దేశంలోని ప్రతి కుటుంబం సొంత కుటుంబమేనని అన్నారు. రెండు రోజుల ముందు కర్ణాటకలోని కలబురిగిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాట్లాడుతూ ''మోడీ విష సర్పం లాంటివాడు. విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారు. అయితే బయటి నుంచి చూస్తే చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తారు. బాగా మాట్లాడతారు. కానీ ఆయన కడుపునిండా విషమే ఉంటుంది'' అని అన్నారు. ఇక వీటిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన వ్యాఖ్యలు మోదీపై కాదని, బీజేపీపై అని ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. ''భారతీయ జనతా పార్టీయే విషసర్పం. ఆ పార్టీని ముట్టుకుంటే చావు తప్పదు. నేను మోదీ గురించి మాట్లాడలేదు. ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయను. వారి భావజాలంపై మాత్రమే విమర్శలు చేస్తాను'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)